Share News

Deputy CM Bhatti : గురుకులాల ప్రక్షాళన

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:36 AM

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్‌ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.

Deputy CM Bhatti : గురుకులాల ప్రక్షాళన

  • ప్రతి నెలా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

  • ఏ విద్యార్థీ నేలపై పడుకోవడానికి వీల్లేదు

  • మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకో రోజు సందర్శించాలి: డిప్యూటీ సీఎం భట్టి

  • విద్యార్థులకు పోషకాహారం అందించండి

  • ప్రిన్సిపాళ్లను ఆదేశించిన మంత్రి పొన్నం

  • ప్రతి నెలా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

  • గురుకులాలపై గత సర్కారు నిర్లక్ష్యం

  • ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

జగిత్యాల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్‌ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు. ప్రభుత్వ హాస్టళ్లలోనే పారా మెడికల్‌ సిబ్బంది ఉండేవారని, ఆ విధానాన్ని తిరిగి తీసుకొస్తామన్నారు. గురుకుల పాఠశాలలో చదివే ఏ విద్యార్థీ నేలపై పడుకోవడానికి వీల్లేదని, మంచం, పరుపు, దుప్పటిని ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు.

మంగళవారం భట్టి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఇటీవల మృతిచెందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. తరగతి గదులు, డార్మెటరీ, ఆవరణను పరిశీలించారు. పలువురు తల్లిదండ్రులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పెద్దాపూర్‌ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు.


విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపూర్‌ పాఠశాలకు వచ్చానన్నారు. ఇకపై నెలలో ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు గురుకుల పాఠశాలలను సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు నెలకో గురుకుల పాఠశాలలో బస చేయాలని సూచించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో గురుకుల పాఠశాలల పక్కా భవనాల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న గత పాలకులు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. విద్యార్థుల డైట్‌ చార్జీలను పెంచడానికి త్వరలోనే అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించారు. ప్రతి గురుకులంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని గురుకులాల కార్యదర్శి రమణకుమార్‌ను ఆదేశించారు. గురుకులాల్లో పనిచేసే వార్డెన్లు, టీచర్లు, పారా మెడికల్‌ సిబ్బంది రాత్రి సమయాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పెద్దాపూర్‌ పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మృతిచెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి గురుకుల సొసైటీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగం ఇస్తామని హామీచ్చారు. ఆ కుటుంబాలకు ఇల్లు లేనట్లయితే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. భట్టి వెంట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. కాగా, విద్యార్థులకు తగిన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, వేడివేడి పదార్థాలనే వడ్డించేలా జాగ్రత్త తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు కూడా పాఠశాలలపై సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు.

Updated Date - Aug 14 , 2024 | 04:36 AM