Vikarabad: సంక్షోభంలో పంచాయతీలు!
ABN , Publish Date - May 23 , 2024 | 04:51 AM
ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.
నిధుల లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్
జఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎస్‌ఎఫ్‌సీ, నాలుగు నెలలుగా పెండింగ్‌లో కేంద్రం నిధులు
విద్యుత్తు బిల్లులు, వీధిదీపాల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్‌కూ కష్టాలే
పదవిలో ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచులు
ప్రత్యేక అధికారుల పాలనతో మరిన్ని ఇక్కట్లు
అప్పులు చేసి కడుతున్నామంటున్న అధికారులు
నిధులు వస్తేనే.. పంచాయతీల అభివృద్ధి
అది.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని రాంరెడ్డిబావి గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీని నిర్వహించాలంటే ప్రతినెలా రూ.51 వేలు అవసరం. ఈ గ్రామంలోని జనాభా (496 మంది) ప్రకారం పంచాయతీకి ప్రతినెలా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు రూ.26,040, కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.41,335 రావాల్సి ఉంటుంది. అయితే.. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు 18 నెలలుగా, కేంద్రం నిధులు 4 నెలలుగా రావడం లేదు. దీంతో ఈ గ్రామంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రావడంలేదు.
వికారాబాద్ జిల్లా జంషద్‌పూర్ గ్రామ పంచాయతీలో 650 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామానికి ప్రతి నెలా ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రూ.34,130, కేంద్రం నుంచి రూ.54,170 రావాల్సి ఉంది. అయితే ఏడాదిన్నర కాలంగా ఎస్‌ఎ్‌ఫసీ నిధులు, 4 నెలలుగా కేంద్రం నిధులు రావడంలేదు. విద్యుత్తు బిల్లు రూ.24 వేలు, ఇద్దరు కార్మికులకు రూ.12 వేలు, ట్రాక్టర్ డీజిల్ ఖర్చు రూ.7 వేలు, వీధిదీపాల నిర్వహణకు రూ.5 వేలు, ఇతరాలకు రూ.15 వేలు కలిపి ఈ గ్రామ పంచాయతీ నిర్వహణకు ప్రతినెలా రూ.63 వేలు అవసరం. నిధులు రాకపోవడం వల్ల వీటిని సర్దుబాటు చేయలేక అక్కడి అధికారులు సతమతమవుతున్నారు. ఇటీవల గ్రామ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో కొంత సర్దుబాటు చేసినా.. అప్పులు చేసి నిర్వహించాల్సి వస్తోందని అంటున్నారు.
వికారాబాద్ జిల్లా టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు 4 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో రోజువారీ పనులు చేయడానికి వారు ముందుకు రావడంలేదు. ఈ గ్రామానికి ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రూ.1,61,150, కేంద్రం నిధులు ప్రతినెలా రూ.2,55,593 రావాల్సి ఉంది. ఏడాదిన్నరగా ఎస్‌ఎ్‌ఫసీ నిధులు, 5 నెలలుగా కేంద్ర నిధులు రావడంలేదు. దీంతో పంచాయతీ నిర్వహణకు అవస్థ పడాల్సివస్తోంది. ఈ గ్రామంలో ప్రతినెలా రూ.60 వేలు విద్యుత్తు చార్జీలు, సిబ్బంది వేతనాలు రూ.24 వేలు, ట్రాక్టర్ డీజిల్ కోసం రూ.14 వేలు, ఇతరాల కోసం రూ.28వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది. అలాంటిది నెలల తరబడి నిధులు పెండింగ్‌లో ఉండడంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పలు రకాల పన్నుల రాబడి ఉన్న మేజర్ పంచాయతీల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. ఏమాత్రం ఆదాయ వనరుల్లేని 5,500కు పైగా చిన్న పంచాయతీల్లో చిల్లి గవ్వలేక సంక్షోభంంలో ఉన్నాయి. గత ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటివరకు రెండేళ్లుగా ఎస్‌ఎ్‌ఫసీ నిధులు సక్రమంగా రాకపోవడంతో పంచాయతీల్లో అన్ని కార్యక్రమాలకూ ఇబ్బందిగా మారింది. 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రతినెలా దాదాపు రూ.180 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎ్‌ఫసీ కింద ప్రతి నెలా రూ.120 కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలోని పంచాయతీలకు కేంద్రం నిధులు నాలుగు నెలలకు సంబంధించి రూ.720కోట్లు ఎస్‌ఎఫ్ నిధులు 16నెలలకు సంబంధించి రూ.1,920కోట్లు రావాల్సి ఉంటుందని అంచనా! పెండింగ్‌లో ఉన్న ఈ నిధులు విడుదలైతేనే.. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.
ట్రాక్టర్ డీజిల్‌కూ కష్టమవుతోంది..!
గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి.. డంపింగ్ యార్డుకు తరలించాలంటే ట్రాక్టర్‌ను ఉపయోగించాలి. కానీ, ట్రాక్టర్ కోసం డీజిల్ కొనడమే కష్టమవుతోంది. దీనికితోడు వేసవికాలంలో తాగునీటి సరఫరాకు ఉపయోగించే విద్యుత్తు మోటార్లు రిపేరుకు వచ్చినా బాగుచేయించలేని పరిస్థితి. నెల నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించలేని దుస్థితి. పల్లెల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నా, అపరిశుభ్ర ప్రాంతాల్లో ప్రతిరోజూ బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా.. కొనలేని పరిస్థితుల్లో ఉన్నామని పంచాయతీల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలో పంచాయతీలకు నిధులు విడుదల కాకపోయినా.. వారు ఏదోవిధంగా డబ్బులు సర్దుబాటు చేసేవారు. సర్పంచుల పదవీకాలం పూర్తికావడంతో ఈ ఏడాది పిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారభమైంది. కొన్నిచోట్ల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పనులు నిలిచిపోకుండా ఉండేందుకు డబ్బులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. గ్రామ పంచాయతీలో తాత్కాలిక పనుల కోసం జీతం డబ్బులు ఖర్చు చేస్తుండటంతో కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నామని కొందరు అధికారులు వాపోతున్నారు. అప్పులు చేసి మరీ పంచాయతీలను నిర్వహించాల్సి వస్తోందని. ఉన్నతాధికారులకు భయపడి ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఎప్పుడొస్తాయా? అని స్థానిక విభాగాలు ఎదురుచూస్తున్నాయి. ఆదాయ వనరులుండే మేజర్ గ్రామ పంచాయతీలు తప్ప.. ఇతర చోట్ల ఆర్థిక సమస్య పట్టిపీడిస్తోంది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు రావాల్సిన నిధులు రాకపోవడం, ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల కనీస సమస్యలు కూడా పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయిందని సంబంధిత విభాగాలు చెబుతున్నాయి.
పనిచేసేందుకు కార్మికుల నిరాసక్తి
గ్రామ పంచాయతీలకు నిధుల లేమి కారణంగా చాలా చోట్ల సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో రోజువారీ పనులు చేసేందుకు కార్మికులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోని 500 జనాభాకు ఒక మల్టీపర్పస్ కార్మికుడిని నియమించుకునే అవకాశం కల్పించింది. వీరు విద్యుత్ లైట్లు, పారిశుధ్యం, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, చెత్త ట్రాక్టర్ నడిపించడం, మంచినీటి సరఫరా వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అయితే అసలే చాలీచాలని వేతనాలతో (రూ.8,500) పనిచేస్తున్న వీరికి ప్రస్తుతం మూడు నెలలుగా బకాయిలున్నాయి. దీంతో చాలా పంచాయతీల్లో కార్మికులు విధులకు రావడం లేదని తెలుస్తోంది. మేజర్ పంచాయతీల్లో తగినంత మంది పారిశుధ్య సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటే.. వారికి డబ్బులు చెల్లించడం కూడా కష్టంగా ఉంటోందని, ఇప్పటికే బకాయి వేతనాలకోసం కార్మికులు రోజూ తమపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు ప్రత్యేకాధికారులు చెబుతున్నారు.
ఎన్నికల కోడ్ వల్లే..!
గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచుల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముందుగా సమాచారం ఇస్తుందని, ప్రస్తుతం కేంద్రం నిధులు ఆగిపోవడానికి ఎన్నికల కోడ్ కారణమని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాకే పంచాయతీ ఎన్నికలు జరపాలి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సర్పంచుల సంఘం వినతి
అప్పులు చేసి మరీ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సర్పంచుల సంఘం కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథిని సర్పంచుల సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘గత ప్రభుత్వంలోనే అధిక మొత్తంలో బిల్లులు బకాయి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదు. మా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సర్పంచులకు రావాల్సిన బకాయి బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రభుత్వానికి సూచన చేయాలి’ అని కోరారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, జేఏసీ కమిటీ అధ్యక్షుడు సుర్వియాదయ్యగౌడ్ మీడియాతో మాట్లాడారు. తమ తమ గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు గత ప్రభుత్వం హయాంలో అప్పులు చేసి మరీ పనులు చేయించారన్నారు. మూడున్నరేళ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా బిల్లులు మంజూరు చేయాలని కోరారు.