Hyderabad: రాష్ట్రంలో పెరగనున్న డయాలసిస్ కేంద్రాలు
ABN , Publish Date - May 28 , 2024 | 04:30 AM
రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలు, డయాలసిస్ కేంద్రాల పనితీరు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం కోఠిలోని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కార్పొరేషన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలు, డయాలసిస్ కేంద్రాల పనితీరు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం కోఠిలోని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కార్పొరేషన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్నవారి సంఖ్యకు అనుగుణంగా డయాలసిస్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 143 డయాలసిస్ కేంద్రాలున్నాయి. వీటిలో 45 కేంద్రాల్లో రోజుకు 4-5 సెషన్లు డయాలసిస్ చేస్తున్నారు. వీటిపై రోగుల భారం ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్రాలకు సమీపంలో మరికొన్ని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు మంత్రికి వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దామోదర రాజనర్సింహ తొలిసారి కోఠిలోని హెచ్‌వోడీ విభాగాలను సందర్శించారు.కాగా, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ల్యాబుల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నా ఆన్‌లైన్ రిపోర్టులు వచ్చే విధంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లను, ప్రభుత్వాస్పత్రుల్లోని ల్యాబ్‌న్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.