Share News

Fair Price Shops: వచ్చే ఏడాది నుంచి రేషన్‌ సన్నబియ్యం

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:11 AM

వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నం బియ్యం పంపిణీ చేయాలని.. కొత్త తెల్ల రేషన్‌ కార్డుల జారీ విఽధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.

Fair Price Shops: వచ్చే ఏడాది నుంచి రేషన్‌ సన్నబియ్యం

  • చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ

  • కుటుంబ వివరాలతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డులు

  • కొత్త రేషన్‌ కార్డులపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామాల్లో రూ.లక్షన్నర,

  • పట్టణాల్లో 2 లక్షల ఆదాయ పరిమితి

  • మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నం బియ్యం పంపిణీ చేయాలని.. కొత్త తెల్ల రేషన్‌ కార్డుల జారీ విఽధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. చౌక ధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా, సగంపైగా దారి మళ్లుతోందని గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు.. ప్రతి ఒక్కరూ తినడానికి అనువుగా ఉండేలా చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యంఅందజేయాలని పేర్కొంది.


రేషన్‌ కార్డులతో పాటు రాజీవ్‌ ఆరోగ్య శ్రీ కార్డులను స్మార్డ్‌ కార్డుల రూపంలో ఇవ్వనున్నారు. కుటుంబం సమగ్ర ఆరోగ్య వివరాల (హెల్త్‌ ప్రొఫైల్‌)తో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని సూచించింది. ఆరోగ్య శ్రీ ప్రయోజనం కోసం కొందరు తెల్ల కార్డులు తీసుకుంటున్నారని.. వేర్వేరుగా జారీ చేస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. మంత్రివర్గ ఉప సంఘం సమావేశం శనివారం సచివాలయంలో పౌర సరఫరాలు, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.


పట్టణాల్లో రూ.2 లక్షల్లోపు, గ్రామాల్లో రూ.లక్షన్నర వార్షికాదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు లేదా చెల్క 7.5 ఎకరాల లోపు ఉన్నవారికే తెల్ల కార్డులివ్వాలని ప్రతిపాదించింది. పెండింగ్‌లో పది లక్షల దరఖాస్తులున్నట్లు పేర్కొంది. ఏపీ, తెలంగాణల్లోనూ కార్డులున్న వారికి ఆప్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అర్హతలపై విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తక్షణమే లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌కు మంత్రి ఉత్తమ్‌ సూచించారు. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్నవారెవరూ తెల్ల కార్డు అవకాశం కోల్పోకుండా అధ్యయనం జరగాలనేదే ఉద్దేశంగా పేర్కొన్నారు.


గ్రామీణ ప్రాంతాల్లో కార్డుల జారీకి సంబంధించి డాక్టర్‌ ఎన్‌.సి.సక్సేనా, సుప్రీంకోర్టు స్పెషల్‌ కమిషనర్‌గా పనిచేసిన హర్షమందర్‌ కమిటీ, పట్టణ ప్రాంతాల్లో కార్డుల జారీకి సంబంధించి హషీమ్‌ కమిటీ ముసాయిదా నిబంధనలపై అధ్యయనం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో 65 లేదా ఆపైన వయసుండి, ఏ ఆదాయ వనరులు లేనివారికి అన్నపూర్ణ కార్డులు జారీ చేస్తున్నట్లు అధికారులు ప్రస్తావించారు. అర్హులందరికీ తెల్లకార్డులు జారీ చేస్తామన్న ఉత్తమ్‌.. సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.


సక్సేనా, హషీమ్‌ కమిటీ సిఫారసుల ప్రకారం.. ఒంటరి మహిళలతో పాటు సామాజికంగా వెనుకబాటుకు గురైన వర్గాలకు, ఆదివాసీ గిరిజను (చెంచులు, కోలామ్స్‌, తోటి, కొండరెడ్లు)లకు, భూమి లేని వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులు, ప్రత్యేక వైకల్యం ఉన్నవారికి అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే జారీ చేసిన కార్డుల్లో కొత్త సభ్యుల (16,36,687) చేర్పునకు వచ్చిన 11,33,881 దరఖాస్తులను ఆమోదిస్తే రూ.495 కోట్లు, కొత్త కార్డులకు వచ్చిన 10 లక్షల దరఖాస్తుల (31.60 లక్షలమందికి సంబంధించి)ను ఆమోదిస్తే ఏటా రూ.956 కోట్ల భారం పడనుంది.


  • 80 శాతం కుటుంబాలకు తెల్ల కార్డులు

రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబాలు 83,03,612 కాగా.. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,03,95,629గా తేలాయి. తాజాగా 1,11,23,323కు పెరిగాయి. ఈ ప్రకారం 80.88 శాతం కుటుంబాలకు (89,96,579) తెల్ల కార్డులు ఉన్నాయి. దేశంలో రేషన్‌ కార్డులు పొందడానికి వార్షికాదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ అని.. అక్కడ రూ.3 లక్షల లోపు ఉన్నవారిని బీపీఎల్‌గా గుర్తించి, కార్డులు ఇస్తున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.

Updated Date - Aug 11 , 2024 | 03:11 AM