Khammam: ప్రియురాలు చెప్పిందని..
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:44 AM
కట్టుకున్న భర్తే వైద్యుడు! తనకొచ్చిన జ్వరం నయమయ్యేందుకు ఇంజెక్షన్ చేస్తానంటే అతడిని ఆమె ఎలా అనుమానిస్తుంది? భార్యను చంపేందుకు ఎప్పుడో పథకం వేసి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ భర్త విషపు ఇంజెక్షన్‌ను ఇచ్చి ఆమె ప్రాణలు బలిగొన్నాడు.
భార్య, ఇద్దరు పిల్లలను చంపిన వైద్యుడు
విషపు ఇంజెక్షన్‌తో భార్య ప్రాణాలు తీసి..
కుమార్తెలను ముక్కు, నోరు మూసి హత్య
కారును చెట్టుకు ఢీకొట్టి ప్రమాదంగా ప్రచారం
48 రోజుల తర్వాత వీడిన మిస్టరీ.. భర్త అరెస్టు
రఘునాథపాలెం, జూలై 14: కట్టుకున్న భర్తే వైద్యుడు! తనకొచ్చిన జ్వరం నయమయ్యేందుకు ఇంజెక్షన్ చేస్తానంటే అతడిని ఆమె ఎలా అనుమానిస్తుంది? భార్యను చంపేందుకు ఎప్పుడో పథకం వేసి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ భర్త విషపు ఇంజెక్షన్‌ను ఇచ్చి ఆమె ప్రాణలు బలిగొన్నాడు. తర్వాత తన కన్నబిడ్డలిద్దరినీ ముక్కూ నోరు మూసి చంపేశాడు. ఆపై రోడ్డు ప్రమాదం జరిగినట్టు, ఆ ప్రమాదంలోనే భార్యాపిల్లలు చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. అయితే ఘటన జరిగిన 48 రోజుల తర్వాత అతడి దుర్మార్గం బట్టబయలైంది. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వైద్యుడు, తన ఆ ఆనందానికి భార్యాబిడ్డలు అడ్డుగా ఉన్నారని భావించి ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మం డలంలో రోడ్డు ప్రమాదం-ముగ్గురి మరణం ఘటన వెనుక మిస్టరీ వీడింది. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఏన్కూ రు మండలం రామ్‌నగర్‌కు చెందిన కుమారి(28)కి రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్‌తో 2019లో వివాహం జరిగింది. ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనస్థిషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్-కుమారి దంపతులకు కూతుళ్లు కృషిక(5), కృతిక (3) ఉన్నారు.
కుటుంబంతో కలిసి ప్రవీణ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. వృత్తిలో భాగంగా ఆస్పత్రిలో రాత్రిపూట విధు లు నిర్వహించే ప్రవీణ్‌కు అక్కడే పనిచేస్తున్న కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సీస్ అనే యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి భార్య కుమారికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీలు నిర్వహించి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఈ గొడవలు సోనీకి చికాకు తెప్పించాయి. భార్యాపిల్లలను అడ్డుతొలగించుకుంటే ఇద్దరం కలిసి ప్రశాంతంగా ఉండొచ్చంటూ ఆమె ప్రవీణ్‌కు చెప్పింది. దీనికి ప్రవీణ్ అభ్యంతరం చెప్పకపోగా భార్య,పిల్లల హత్యకు పథకం వేశాడు. సొంతూర్లో ఇంటి వద్ద పనులున్నాయని చెప్పి.. మే నెలలో పది రోజులు ప్రవీణ్ సెలవు పెట్టి భార్యాపిల్లలను వెంటబెట్టుకొని బావోజీ తండాకు వచ్చాడు.
అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఎన్ని గంటల్లో చనిపోతారనే విషయమ్మీద అప్పటికే గూగుల్లో వెతికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మే 26న కుమారి ఇంజెక్షన్ చేయడానికి విఫలయత్నం చేశాడు. రెండ్రోజుల తర్వాత ఆధార్ కార్డులను ఆప్‌డేట్ చేయాలంటూ భార్యాపిల్లలను వెంటబెట్టుకొని కారులో ఖమ్మానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కుమారి.. అనారోగ్యంగా ఉందనడంతో బల్లేపల్లి సెంటర్‌లోని ఓ మెడికల్ షాపులో క్యాల్షియం ఇంజెక్షన్‌తో పాటు మరో ఇంజెక్షన్‌నూ కొనుగోలు చేశాడు. ఓ 3 కి.మీ దూరం వెళ్లాక కోయచెలక సమీపంలో కారు ఆపాడు. భార్యను వెనుక సీట్లో పడుకోబెట్టి రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. వెంటనే కుమారి స్పృహ కోల్పోయింది. తర్వాత.. ఒకరు తర్వాత మరొకరుగా ఇద్దరు చిన్నారులను ముక్కు, నోరు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కుమారి కూడా చనిపోయిందని నిర్ధారించుకొని మృతదేహాలతో కారులో బయలుదేరాడు. సొంతూరు వెళ్లే దారిలో మంచుకొండ అనే ప్రాంతం వద్ద కారు ఎడమవైపు దెబ్బతినేలా పథకం ప్రకారం రోడ్డు పక్కన చెట్టుకు బలంగా ఢీకొట్టాడు.
కారులో దొరికిన ఖాళీ సిరంజ్ ఆధారంగా
ప్రవీణ్ స్వల్పగాయాలతో బయటపడటం, ఏ చిన్నగాయం కూడా కాకున్నా కుమారి, ఇద్దరు పిల్లలు చనిపోవడం.. ఆమె తరఫువారిలో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. ఫలితంగా ఘటన మరుసటి రోజే కుమారి తరఫు బంధువులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. తమ కూతురు, మనుమరాళ్ల మృతి విషయంలో అనుమానాలున్నాయని కుమారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కారులో ఖాళీ సిరంజి దొరికింది. కుమారి మృతదేహం చేతికి చిన్న చిన్న మచ్చలు ఉండటంతో అవి ఇంజెక్షన్లకు సంబంధించినవి కావొచ్చునని అనుమానంతో ఫోరెన్సిక్ నిపుణులకు సిఫారసు చేయగా వారొచ్చి నమూనాలు స్వీకరించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా ముగ్గురిది హత్య అని తేలింది. ప్రవీణ్‌ను పోలీసులు విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. అతడి ప్రియురాలు సోనీపైనా కేసు నమోదు చేశారు.