Zahirabad: nగుండెపోటుతో బస్సులోనే డ్రైవర్ మృతి..
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:46 AM
గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు.
అస్వస్థతతోనే 11 కి.మీ దూరం డ్రైవింగ్
జహీరాబాద్ వద్ద నిలిపి బస్సు వెనక సీట్లోకి..
అక్కడ పడుకునే ప్రయత్నం చేస్తూ కిందపడి మృతి
జహీరాబాద్, జూలై 12: గుండెనొప్పితో బాధపడుతూనే ఆ డ్రైవర్, ఆర్టీసీ బస్సును 11 కి.మీ మేర సురక్షితంగా నడిపాడు. అలసటగా ఉందంటూ బస్సును ఓ చోట ఆపి, వెనుక సీట్లోకి వెళ్లి పడుకునే ప్రయత్నంలో తుదిశ్వాస విడిచాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. మృతుడు కర్ణాటకలోని బస్వకల్యాణ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ మహదేవ్ (45). ఆ ఆర్టీసీ బస్సును మహదేవ్ గురువారం సాయంత్రం జహీరాబాద్ శివారు సత్వార్‌లోని ఓ దాబా వద్ద భోజనం కోసం ఆపాడు.
ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో కొందరు దాబాలో భోజనం చేశారు. డ్రైవర్ మహదేవ్ కూడా భోజనం చేస్తుండగానే ఛాతీలో నొప్పిగా ఉందంటూ ప్రయాణికులకు చెప్పాడు. ఆ తర్వాత ప్రయాణికులను ఎక్కించుకొని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్‌కు సురక్షితంగా చేర్చాడు. తర్వాత మహదేవ్ తనకు అలసటగా ఉందంటూ బస్సు వెనుక సీట్లోకి వచ్చి పడుకునే ప్రయత్నం చేస్తూ కిందపడి మృతిచెందాడు.