Share News

TG NAB: డార్క్‌ వెబ్‌లో డ్రగ్స్‌ దందా!

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:45 AM

పోలీసు నిఘా పెరగడం వల్ల బహిరంగ మార్కెట్‌లో మత్తుపదార్థాలు చేతులు మారే పరిస్థితి లేకపోవడంతో ముఠాలు డార్క్‌వెబ్‌ను అడ్డాగా మార్చుకుంటున్నాయి.

TG NAB: డార్క్‌ వెబ్‌లో డ్రగ్స్‌ దందా!

  • స్పీడ్‌ పోస్ట్‌లో డెలివరీ.. క్రిప్టోలో చెల్లింపులు

  • అసోం నుంచి ఖమ్మం వచ్చిన డ్రగ్స్‌ పార్సిల్‌

  • టీజీ న్యాబ్‌ సాంకేతిక బృందం నిరంతర నిఘాతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

  • హైదరాబాద్‌ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్‌

  • 60 లక్షల సరుకు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌/ఖమ్మం, ఆగస్టు 10 ((ఆంధ్రజ్యోతి): పోలీసు నిఘా పెరగడం వల్ల బహిరంగ మార్కెట్‌లో మత్తుపదార్థాలు చేతులు మారే పరిస్థితి లేకపోవడంతో ముఠాలు డార్క్‌వెబ్‌ను అడ్డాగా మార్చుకుంటున్నాయి. కొరియర్‌, స్పీడ్‌ పోస్ట్‌లో సరుకును నేరుగా కావాల్సిన చోటుకు డెలివరీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు జరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గంలో జరుగుతున్న ఈ దందాపైనా టీజీ న్యాబ్‌ దృష్టి సారించింది. ప్రత్యేకంగా టెక్నికల్‌ వింగ్‌ను రంగంలోకి దింపింది. డార్క్‌వెబ్‌, ఇతర సామాజిక మాధ్యమాలపై నిరంతర ట్రాకింగ్‌తో డ్రగ్స్‌ దందా బయటపడింది.


  • ఇంటి ముందు మాటువేసి...

ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మత్తుకు బానిసయ్యాడు. డార్క్‌వెబ్‌లో డ్రగ్స్‌ ఆర్డర్‌ చేసి క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు చెల్లించాడు. విక్రేత అసోంలోని సిల్పుఖురి నుంచి డ్రగ్స్‌ను ఖమ్మంకు స్పీడ్‌ పోస్ట్‌ చేశాడు. డార్క్‌వెబ్‌పై నిఘా కొనసాగిస్తున్న ట్యీబ్‌ సాంకేతిక బృందం ఈ విషయం గుర్తించింది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం పోలీసులకు సమాచారం అందించి స్పీడ్‌ పోస్ట్‌ పార్సిల్‌ను నిరంతరం ట్రాక్‌ చేశారు. గత నెల 31న ఆర్డర్‌ చేయగా.. సరుకు గత గురువారం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇంటికి డెలివరీ అయింది. అప్పటికే ఇంటి ముందు మాటువేసిన పోలీసులు డ్రగ్స్‌తో వచ్చిన స్పీడ్‌ పోస్ట్‌ పార్సిల్‌ తీసుకుంటుండగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్స్‌కు బానిసైన ఆ టెకీకి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోవైపు డార్క్‌వెబ్‌లో డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన ముఠా లింక్‌ను గుర్తించే పనిలో ఉన్నట్లు టీజీ న్యాబ్‌ అధికారులు తెలిపారు.


  • సమాచారమివ్వండి: టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌

గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే టీజీ న్యాబ్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 1908కు లేదా 87126 71111 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యా కోరారు. ్టటుఽ్చఛజిౌజిడఛీః్టటఞౌజూజీఛ్ఛి.జౌఠి.జీుఽ ఈ-మెయిల్‌లోనూ సమాచారం పంపవచ్చన్నారు.


  • హైదరాబాద్‌ టూ న్యూజిలాండ్‌..

ఇప్పటివరకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా జరుగుతుండగా తాజాగా హైదరాబాద్‌ నుంచి ఇతర దేశాలకు డ్రగ్స్‌ ఎగుమతి అవుతున్న విషయం బయటపడింది. హైదరాబాద్‌ నుంచి న్యూజిలాండ్‌కు డ్రగ్స్‌ (ఎఫిడ్రిన్‌) కొరియర్‌ చేస్తున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) జోనల్‌ యూనిట్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది. డ్రగ్స్‌ కొరియర్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని శనివారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.60 లక్షల విలువైన పొడి రూపంలో ఉన్న 3 కిలోల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారుల నుంచి అవసరమైన సమాచారం సేకరించే పనిలో న్యాబ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Aug 11 , 2024 | 04:45 AM