Share News

Eatala Rajendar: మూసీ ప్రక్షాళన వెనుక మరో కోణం

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:25 AM

హైదరాబాద్‌లో మూసీనది ప్రక్షాళన వెనుక మరో కోణం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రయత్నాలు సాగిస్తోందని, అది సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు,

Eatala Rajendar: మూసీ ప్రక్షాళన వెనుక మరో కోణం

  • హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌

  • హైదరాబాద్‌లో హైడ్రాతో అందరికీ భయం

  • రేవంత్‌రెడ్డి పాలనలో రియల్‌ ఎస్టేట్‌ కుదేలు

  • మల్కాజిగిరి ఎంపీ ఈటల

ఖమ్మం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హైదరాబాద్‌లో మూసీనది ప్రక్షాళన వెనుక మరో కోణం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రయత్నాలు సాగిస్తోందని, అది సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో హైడ్రాతో అందరు భయపడుతున్నారని, హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారని అన్నారు. ఖమ్మంలోని పాతఖానాపురంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఈటల ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తప్ప ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలు కావడంలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? అసలు రైతుబంధు ఇస్తారా ? లేదా అనే విషయాల్లో స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు, ఇళ్లు మునిగి ఆస్తి నష్టపోయిన కుటుంబాలకు సైతం ఇప్పటి వరకు వరద సాయం చాలామందికి అందలేదన్నారు. రాష్ట్రంలో వరద నష్టానికి కేంద్రం నుంచి సహాయం అందించడం లేదని కాంగ్రెస్‌ మంత్రులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని కూల్చిన దుష్ట శక్తులను ప్రభుత్వం శిక్షించాలని ఈటల డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 18 , 2024 | 03:25 AM