Mahesh Cooperative Bank: రూ.300 కోట్లు గోల్‌మాల్ !
ABN , Publish Date - Aug 01 , 2024 | 05:06 AM
మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకు కేసు
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, నిబంధనలకు విరుద్ధంగా రూ.300 కోట్లకుపైగా రుణాల మంజూరు, బ్యాంకు నుంచి రూ.18.30 కోట్లు దారి మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది.
ఇందులో భాగంగా బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, వైస్ చైర్మన్ పురుషోత్తమదాస్, ఎండీ ఉమేష్ చంద్‌కు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించాయి. ఈ సమాచారం ఆధారంగా నిధుల దారిమళ్లింపుతో సంబంధం ఉన్న వెంకట్, మరో ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.