Share News

Nowhera Shaik: నౌహీరాకు యూఏఈలో ఆస్తులు!

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:18 AM

పెట్టుబడులకు అధిక లాభాల పేరుతో లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కొట్టేసిన కేసులో హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరంపర కొనసాగుతోంది.

Nowhera Shaik: నౌహీరాకు యూఏఈలో ఆస్తులు!

  • తాజా సోదాల్లో గుర్తించిన ఈడీ అధికారులు

  • కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న రూ.70 కోట్ల ఆస్తులు స్వాధీనం

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు అధిక లాభాల పేరుతో లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కొట్టేసిన కేసులో హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పరంపర కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు తాజాగా మరిన్ని స్థిర, చరాస్తులు, లెక్కలో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. హీరా గ్రూప్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపి రూ.90 లక్షల నగదు, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లు, 9 టొయోటా ఫార్చునర్లు, మహీంద్రా స్కార్పియో సహా 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


నౌహీరాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఉన్న రూ.45 కోట్ల విలువైన 13 ఆస్తుల పత్రాలు, బినామీల పేరిట ఉన్న రూ.25 కోట్ల విలువైన 11 ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోని లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి రూ.వేల కోట్లు కాజేసిన నౌహీరా వాటిని విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పలు పత్రాలు, డిజిటల్‌ ఆధారాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు.


భారత్‌లో కొల్లగొట్టిన నగదుతో యూఏఈలో స్థిర, చరాస్తులు కొన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. గత శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు జరిపిన సోదాలకు సంబంధించిన వివరాలను ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. కాగా, నౌహీరా షేక్‌ అండ్‌ కో మరో కొత్త మోసానికి తెరతీసే కుట్రను ఈడీ అధికారులు భగ్నం చేశారు. కొత్తగా నిధుల సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై సిద్ధం చేసుకున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.వేల కోట్ల నిధుల గోల్‌మాల్‌ కేసులో ఈడీ ఇప్పటికే నౌహీరా షేక్‌కు సంబంధించిన సుమారు రూ.400 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అటాచ్‌ చేసింది.

Updated Date - Aug 06 , 2024 | 04:18 AM