Eleti Maheswara Reddy : కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ప్రమాదం
ABN , Publish Date - Aug 14 , 2024 | 05:26 AM
సుంకిశాల పంప్‌హౌస్ ఇన్‌టేక్ వెల్ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే రిటైనింగ్ వాల్ కుప్పకూలిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు.
అయినా ప్రభుత్వం దానిని వెనకేసుకొస్తోంది: ఏలేటి
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నల్లగొండ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సుంకిశాల పంప్‌హౌస్ ఇన్‌టేక్ వెల్ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే రిటైనింగ్ వాల్ కుప్పకూలిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆ సంస్థ వల్లే సుంకిశాల ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోకుండం లేదని ప్రశ్నించారు.
మంగళవారం నల్లగొండ జిల్లా సుంకిశాల ఎత్తిపోతలను మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీష్, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సుంకిశాల ఘటన జరిగి 12 రోజులు గడుస్తున్నా ఒక్క మంత్రి కానీ, ఉన్నతాధికారి కానీ ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ చర్యలకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు. తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.