Share News

Hyderabad: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు.. తొలి రోజు 56,674 మంది స్లాట్ల నమోదు..

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:31 AM

ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి రోజైన గురువారం 56,674 మంది అభ్యర్థులు స్లాట్లను నమోదు చేసుకున్నారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు స్లాట్లను నమోదు చేసుకోవడానికి ఈ నెల 12వరకు గడువు ఉంది.

Hyderabad: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు.. తొలి రోజు 56,674 మంది స్లాట్ల నమోదు..

  • ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఫిలియేషన్‌, సీట్ల కేటాయింపు కసరత్తు పూర్తి!

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి రోజైన గురువారం 56,674 మంది అభ్యర్థులు స్లాట్లను నమోదు చేసుకున్నారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు స్లాట్లను నమోదు చేసుకోవడానికి ఈ నెల 12వరకు గడువు ఉంది. ఈలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌ స్లాట్లను నమోదు చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత జూలై 6 నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, 8 నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 19న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 19 నుంచి 23వ తేదీ వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ను చేయాలి. జూలై 26వ తేదీ నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ను, ఆగస్టు 8 నుంచి చివరి దశ కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టు 21 నుంచి 28 వరకు ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.


ఆగస్టు 28న స్పాట్‌ అడ్మిషన్లను చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఫిలియేషన్‌, సీట్ల కేటాయింపుపై జేఎన్‌టీయూ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. గురువారం సమావేశమైన వర్సిటీ అకడమిక్‌ అండ్‌ ఆడిట్‌ విభాగం అధికారులు అఫిలియేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. అఫిలియేషన్‌కు ఎంపికైన కళాశాలల జాబితా, వాటిలో అనుమతించిన కోర్సులు, సీట్ల సంఖ్య వంటి వివరాలు సిద్ధం చేశారు. వీటిని శుక్రవారం ఉన్నత విద్యామండలి ద్వారా కౌన్సెలింగ్‌ క్యాంప్‌ అధికారులకు పంపనున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరగడంతో ఈ ఏడాది ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు పెద్దఎత్తున సీట్ల పెంపునకు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాయి.


తెలంగాణలోని అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలకు కలిపి సుమారు 20వేలకు పైగా సీఎ్‌సఈ, సీఎ్‌సఈ అనుబంధ సీట్లను పెంచుకునేందుకు ఏఐసీటీఈ ఆమోదం తెలుపగా.. రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఇన్‌టేక్‌తోనే కౌన్సెలింగ్‌కు వెళ్లేలా జేఎన్‌టీయూ అధికారులు కళాశాలల జాబితా సిద్ధం చేశారు. దీంతో సీట్ల పెంపుపై కొన్ని పెద్ద కళాశాలల యాజమాన్యాల అశలు గల్లంతైనట్లయింది. గతేడాది జేఎన్‌టీయూ అఫిలియేషన్‌ పొందిన 139 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొత్తం 90,869 సీట్లుండగా, ఇందులో ప్రైవేటు కాలేజీల సీట్లు 82,500, ప్రభుత్వ (వర్సిటీ అనుబంధ)కళాశాలల నుంచి సుమారు 8,369 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం కూడా సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పులు ఉండే అవకాశంలేదని జేఎన్‌టీయూ వర్గాలంటున్నాయి.

Updated Date - Jul 05 , 2024 | 04:31 AM