Share News

Yadagirigutta: ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీ ‘ఎస్’

ABN , Publish Date - Jul 18 , 2024 | 04:08 AM

హైదరాబాద్‌ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీ పరంగా త్వరలోనే ఊరట లభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సహా గ్రేటర్‌ పరిఽధిలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్లొచ్చు!

Yadagirigutta: ఘట్‌కేసర్‌-యాదాద్రి ఎంఎంటీ ‘ఎస్’

  • 33 కి.మీ రైల్వేలైన్‌ నిర్మాణం పరంగా ముందడుగు

  • 60ఎకరాల భూసేకరణకు త్వరలోనే నోటిఫికేషన్‌

  • రద్దీ, చార్జీల పరంగా ప్రయాణికులకు ఊరట

  • భువనగిరి ఆర్డీవోకు భూసేకరణ బాధ్యతలు

యాదాద్రి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీ పరంగా త్వరలోనే ఊరట లభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సహా గ్రేటర్‌ పరిఽధిలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్లొచ్చు! ఈ మేరకు ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఘట్‌కేసర్‌-యాదగిరిగుట్ట (రాయగిరి) ఎంఎంటీఎస్‌ రైలు మార్గం విస్తరణ పనుల్లో కీలక ముందడుగు పడనుంది. 33 కి.మీ మేర రైలు మార్గం నిర్మాణానికి భూసేకరణ కోసం త్వరలోనే రైల్వేశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇందుకు 60 ఎకరాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవ్వడం.. నిర్మాణం పూర్తయ్యాక భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాతో ఘట్‌కేసర్‌ దాకా ఉన్న ఎంఎంటీఎస్‌ లైన్‌ను రాయగిరి రైల్వే స్టేషన్‌ దాకా విస్తరించాలని అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయించింది.


కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించేందుకు 2016-17లో రూ.330 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపగా కేంద్రం సరేనంది. తర్వాత రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో విస్తరణ పనులను రైల్వేశాఖ పెడింగ్‌లో పెట్టింది. అయితే భక్తుల సౌకర్యార్థం ఘట్‌కేసర్‌-రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులంతా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అనుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండానే ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించేందుకు 2023లో నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో భూ సేకరణ కోసం త్వరలోనే టెండర్లు పిలవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్‌వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌బీఎన్‌ల్‌) ద్వారా పనులు చేపట్టనున్నారు. అయితే అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ.412 కోట్లకు పెరగడం గమనార్హం.


భూసేకరణ బాధ్యతలు భువనగిరి ఆర్డీవో

ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరించనున్న నేపథ్యంలో భూసేకరణ అధికారిగా భువనగిరి ఆర్డీవోను నియమించాం. బీబీనగర్‌, భువనగిరి మండలాల్లోని పలు గ్రామాల నుంచి రైల్వేలైన్‌ ఏర్పాటు కానుంది. ఆయా గ్రామాల వారీగా భూసేకరణ కోసం సర్వే చేపట్టనున్నాం.

- హనుమంతు కె.జెండగే, కలెక్టర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా

Updated Date - Jul 18 , 2024 | 04:08 AM