Loksabha Elections: 9 నుంచి 13 సీట్లు పక్కా..!!
ABN , Publish Date - May 15 , 2024 | 03:37 AM
రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటామని, దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు
ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం.. దాని ద్వారానే రైతు రుణమాఫీ
సన్న వడ్లు పండిస్తేనే రూ.500 బోనస్
రైతుల పంట ఉత్పత్తులు సేకరించి
రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా
వచ్చే పదేళ్లూ రాష్ట్ర పాలనలోనే ఉంటా
ఫోన్ ట్యాపింగ్‌పై అసెంబ్లీలోనే చెబుతాం
ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా
సత్సంబంధాలు పెట్టుకుంటాం
సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం
కేంద్రపాలిత ప్రాంతం విఫల ప్రయోగం
మండలాలు, రెవెన్యూ డివిజన్ల
హేతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపై ఆలోచన
రాష్ట్రంలో 13 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం
ఆరు సీట్లలో బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది
మెదక్‌లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది
కంటోన్మెంట్‌లో 20 వేల మెజారిటీ వస్తుంది
మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
మండలాలు, రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేయకుండా జిల్లాలను ఏర్పాటు చేసినా ఉపయోగం ఉండదు. ముందుగా మండలాలు, రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్ చేపడతాం.
కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ను
ఒక జిల్లా చేసి.. ఒకే నియోజకవర్గం ఉన్న వనపర్తినీ జిల్లా చేశారు.
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రుణం తీసుకుంటామని, దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్‌చాట్‌గా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలో ముగిసినందున ఇక పరిపాలనపైనే వందశాతం దృష్టి పెడతామని, బుధవారం నుంచి సచివాలయానికి వెళతానని చెప్పారు. ముందుగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంపై, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఫోకస్ చేస్త్తామన్నారు. వీటితోపాటు రైతు రుణమాఫీ అంశం, విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు, పాఠశాలల్లో సంస్కరణలు, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా వంటి వాటిపైనా దృష్టి సారిస్తామన్నారు. పాలనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు, పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఎంత మేరకు రుణాలు ఉన్నాయన్నది అంచనా వేస్తామన్నారు. రైతుల రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం బదలాయించుకునేందుకు ఆర్‌బీఐ అంగీకరించబోదన్న మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి రుణం తీసుకుంటే ఆర్‌బీఐ ఎందుకు అంగీకరించదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధరణి తదితరాలన్నింటిపైనా శాసనసభలో చర్చిస్తామని, సభలో చర్చకు పెట్టకుండా ఏదీ చేయబోమని స్పష్టం చేశారు. అఖిలపక్షాలు, స్టేక్ హోల్డర్లతోనూ చర్చిస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు.. కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాతే ఉంటాయని, కేంద్రం నుంచి వచ్చే నిధుల వెసులుబాటును చూసుకునే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని వెల్లడించారు. అందుకే రైతు రుణమాఫీకి ఆగస్టు 15 గడువు పెట్టుకున్నట్లు చెప్పారు.
రేషన్ షాపుల ద్వారా పంటల పంపిణీ..
రైతులు పండించే వరి, ఇతర పంటలను పౌరసరఫరాల సంస్థ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి సేకరిస్తామని, వాటిని ఉత్పత్తుల కింద మార్చి రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రేషన్ షాపుల ద్వారా బియ్యంతోపాటు తొమ్మిది రకాల వస్తువులను సరఫరా చేసిందని గుర్తు చేశారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రైతులు ఆ వడ్లు పండించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాలుకు మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తామని చెబుతామన్నారు. అప్పుడు రైతులు కూడా సన్న వడ్లు పండించేందుకు ముందుకొస్తారని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ అన్నారు. వీటితోపాటు అన్ని కార్యక్రమాలకు సంబంధించి గ్రామసభల్లో తీసుకున్న దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసినట్లు చెప్పారు. రిటైర్ అయి కూడా వివిధ శాఖల్లో కొనసాగుతున్న అధికారులు వెయ్యి మందికి పైగా ఉన్నారని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించి వారి విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్ణాటకలో కరువు పరిస్థితులున్నా.. వారిని ఒప్పించి రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం రెండున్నర టీఎంసీల కృష్ణా నీటిని ఆ రాష్ట్రం నుంచి తెచ్చామని గుర్తు చేశారు. 59 జీవోను అబయన్స్‌లో పెట్టామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమీక్షిస్తామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధిత అంశాలను అసెంబ్లీకే చెబుతామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామని చెప్పారు. కరెంటు విషయంలో హరీశ్‌రావు ఒక మెకానిజం ఏర్పాటు చేసి.. ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని కేసులను గుర్తించి నమోదు చేశామన్నారు.
పదేళ్లు రాష్ట్రంలోనే..
రానున్న పదేళ్లూ తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని సీఎం రేవంత్ అన్నారు. రానున్న వందేళ్ల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ప్రజలకు అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో సత్సంబంధాలు పెట్టుకుంటామని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఇక మూసీ నదిని రాష్ట్రానికి ఆదాయాన్నందించే వనరుగా మారుస్తామని, కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ మాదిరిగా తాను మేధావిని కాకపోవడం వల్లనే కన్సల్టెన్సీ నివేదికలపై ఆధారపడుతున్నానని రేవంత్ ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల మెట్రోను అమ్ముకునే పరిస్థితి వస్తుందన్న యాజమాన్యం వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ, ‘‘వాళ్ల ఆస్తిని వాళ్లు అమ్ముకుంటానంటే ఎవరు వద్దన్నారు?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఎవరైనా అంటే అంత తెలివిలేనివాడు ఇంకొకడు ఉండడన్నారు. యూటీ అనేది స్టాప్ గ్యాప్ మాత్రమేనని, అది విఫల ప్రయోగం అని కూడా అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఆరేడు సీట్లలో బీఆర్‌ఎ్‌సకు డిపాజిట్ రాదు..
రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకుగాను ఆరేడు సీట్లలో బీఆర్‌ఎ్‌సకు డిపాజిట్ కూడా రాదని సీఎం రేవంత్ అన్నారు. మెదక్‌లో మాత్రమే ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రె్‌సకు 13 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని తమకు ప్రత్యర్థిగా బీఆర్‌ఎస్ బలవంతంగా సృష్టించిందని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలోనూ మోదీ వేవ్ లేదని, బీఆర్‌ఎస్ ఆ పార్టీ యంత్రాంగం మొత్తాన్ని బీజేపీకి అప్పగించిందని అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ఎన్డీయేకు పది శాతం అటు ఇటుగా 220 సీట్లు వస్తాయని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి 20 వేల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ మాత్రం బీఆర్‌ఎస్ పోటీ ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రాన్ని ప్రకటించడాన్ని కేసీఆర్ తప్పుబట్టడంపై స్పందిస్తూ ఆయన చేసిన పాపాలన్నింటినీ మూసిపెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రైతుబంధు కూడా పూర్తి చేయలేమంటూ మాట్లాడారని, చేశాక అది వాళ్ల గొప్పదనమంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది కూడా వాళ్ల గొప్పతనమే అని చెప్పుకోవచ్చన్నారు.