Fee Reimbursement: ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:08 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యార్థులకు శాపమైంది. ఫీజుల వసూలు అంశంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.

శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య వైఖరి
విద్యార్థుల ఆందోళన.. పరీక్షలు రెండు రోజులు వాయిదా
ఘట్‌కేసర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం విద్యార్థులకు శాపమైంది. ఫీజుల వసూలు అంశంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది. కళాశాలలో పరీక్షలు ప్రారంభమవ్వగా.. ఫీజు బకాయిలున్న నాలుగో సంవత్సర విద్యార్థులను కళాశాల సిబ్బంది గేటు వద్దే ఆపేశారు. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు కళాశాల గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి అడ్మినిస్ట్రేషన్ బ్లాకు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు ఇవ్వకపోతే తమను అడ్డుకోవడం ఏంటనీ నినాదాలు చేశారు.
ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు మద్దతుగా కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోతే విద్యార్థులు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. యాజమాన్యంతో చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కళాశాల చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో పరీక్షలను రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. దీంతో విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బీజేపీ, ఏబీవీపీ నేతలు భరోసా ఇచ్చారు.