School Development: శ్రీమంతుడు నాగ్ అశ్విన్
ABN , Publish Date - Aug 11 , 2024 | 04:31 AM
కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.
స్వగ్రామం ఐతోల్ జడ్పీ హైస్కూల్లో రూ.60 లక్షలతో తరగతి గదుల నిర్మాణం
తల్లిదండ్రులతో ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖ దర్శకుడు
భవిష్యత్‌లోనూ ఊరి అభివృద్ధికి అండగా ఉంటానని హామీ
తాడూరు, ఆగస్టు 10: కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల పరిధిలోని స్వగ్రామం ఐతోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.60 లక్షలతో నాలుగు అదనపు తరగతి గదులను నిర్మించారు. శనివారం వాటి ప్రారంభోత్సవ సభకు నాగ్ అశ్విన్, ఆయన తల్లిదండ్రులు డాక్టర్ జయంతి, డాక్టర్ జయరాంరెడ్డిలతో పాటు ఎమ్మెల్యే కూచకుళ్ల రాజే్‌షరెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు.
తమ తల్లిదండ్రులు వైద్యులైనా.. తనను సినిమా పరిశ్రమ వైపు నడిపించినందుకుగాను నాగ్‌అశ్విన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని తల్లిదండ్రులు తనకు నేర్పించారని, ప్రతి ఒక్కరూ దీనిని అవలంబిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సూచించారు. ఇప్పటికే ఐతోల్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. మున్ముందు కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించారు.
ఎస్‌వీఎస్ ఆస్పత్రి వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి, రాంరెడ్డి మాట్లాడుతూ ఐతోల్‌ను మండల కేంద్రంగా ప్రకటిస్తే కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన నాలుగు ఎకరాల భూమిని తమ రెండు కుటుంబాల నుంచి ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజే్‌షరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థుల కోరిక మేరకు ఐతోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు గడించిన నాగ్ అశ్విన్ స్వగ్రామం అభివృద్ధి పట్ల అంకితభావంతో ఉండటం అభినందనీయమని కొనియాడారు.