Share News

Bhadradri Kothagudem: ‘పెద వాగు’ వైఫల్యంపై నివేదికివ్వండి

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:28 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడి... నీరంతా దిగువ ప్రాంతాలను ముంచెత్తడంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పందించింది. ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను) ఆదేశించింది.

Bhadradri Kothagudem: ‘పెద వాగు’ వైఫల్యంపై నివేదికివ్వండి

  • సర్కారుకు జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదేశం

  • నలుగురు అధికారులకు మెమోలు ఇచ్చిన సీఈ

  • 15 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు సామర్థ్యంపై అనుమానాలు

  • రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం

అశ్వారావుపేట/హైదరాబాద్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడి... నీరంతా దిగువ ప్రాంతాలను ముంచెత్తడంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పందించింది. ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను) ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఎన్‌డీఎ్‌సఏ డైరెక్టర్‌(గేట్స్‌ డిజైన్‌) రాహుల్‌కుమార్‌ సింగ్‌ తెలంగాణకు లేఖ రాశారు. ఈ నెల 18వ తేదీన భారీ వరద రావడంతో పెదవాగు ప్రాజెక్టు కట్టకు 25చోట్ల గండ్లు పడి, గేట్ల పక్కనే కొన్ని మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయింది.


ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం ప్రాజెక్టును వానాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలి. ఈ నేపషథ్యంలో వానాకాలానికి ముందు ప్రాజెక్టు స్థితిగతులపై తనిఖీలు చేశారా? అంటూ ఎన్‌డీఎ్‌సఏ ఆరా తీసింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతోపాటు వైఫల్యానికి గల కారణాలేంటి? ప్రాజెక్టు వద్ద వరద ప్రమాద హెచ్చరికల వ్యవస్థ ఏమైనా ఉందా? అత్యవసర చర్యల ప్రణాళిక ఏమైనా తీసుకున్నారా? వంటి వివరాలు అందించాలని నిర్దేశించింది. వరదను విడుదల చేసే ముందు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఈ నివేదిక అందగానే.. ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ పెదవాగు ప్రాజెక్టును పరిశీలించనుంది.


మరమ్మతులు లేకనే వైఫల్యం

గోదావరి బేసిన్‌లో పెదవాగు ఒక్కటే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. 16వేల ఎకరాలకు నీరందించేలా 1981లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 40,500 క్యూసెక్కుల వరద విడుదలయ్యేలా ప్రాజెక్టు స్పిల్‌వేను నిర్మించారు. 1989లో ఏకంగా 70వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్‌వే ఎడమవైపు 200మీటర్ల మేర కట్ట దెబ్బతిన్నది. 2007లోనే ప్రాజెక్టు సామర్థ్యంపై పలు అనుమానాలు వ్యక్తం కాగా, మరమ్మతుల కోసం రూ.100కోట్లు అవసరమని గుర్తించారు. ఈ మేరకు నిధులు కావాలని ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపినా.. విడుదల కాలేదు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు పరిధిలోని 14వేల ఎకరాల ఆయకట్టు (కుకునూరు, వేలేరుపాడు మండలాలు)ఏపీలోకి వెళ్లగా... అశ్వారావుపేట మండలంలోని 2వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే తెలంగాణకు మిగిలింది.


ప్రాజెక్టు తెలంగాణలో ఉండడం, ఎక్కువ ఆయకట్టు ఏపీలో ఉండడంతో.. ప్రాజెక్టు నిర్వహణ గాలిలో దీపంలా మారింది. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.78.82 కోట్లు అవసరమని, వెంటనే విడుదల చేయాలని 2021లో నిర్వహించిన రెండు రాష్ట్రాల సంయుక్త భేటీలో నిర్ణయించారు. కానీ.. నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత 2022 చివరిలో రూ.1.48కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధులతో గేట్ల మెయింట్‌నెన్స్‌ పనులు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 18న 75వేల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో అధికారులు రెండు గేట్లను మాత్రమే ఎత్తగలిగారు. మోటారు కాలిపోవడంతో మరో గేటును ఎత్తలేకపోయారు. ఇదే ప్రమాదానికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది.


అధికారుల తప్పిదమేనా?

ప్రాజెక్టు పరిధిలో 30మంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 10 మందిలోపే పని చేస్తున్నారు. వారిలోనూ స్థానికంగా ఎవ్వరూ ఉండకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రాజెక్టుకు శాపంగా పరిణమించింది. మరోవైపు ప్రాజెక్టుకు ఎగువ భాగాన వందలాది ఎకరాలను కొందరు ఆక్రమించి.. పంటలను సాగు చేస్తున్నారు. దీని వల్ల ప్రాజెక్టులో పూడిక చేరి, నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. ప్రాజెక్టు వైఫల్యానికి ఇదీ ఓ కారణమని భావిస్తున్నారు. ఆధునికీకరణకు నిధులు ఇవ్వకుండా తెలుగు రాష్ట్రాల్లోని గత ప్రభుత్వాలు చేసిన తప్పిదానికి.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.


నలుగురు అధికారులకు మెమోలు

పెదవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఈఈ సురే్‌షకుమార్‌, అశ్వారావుపేట డీఈఈ కృష్ణ, ఏఈఈ కృష్ణపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ కార్యదర్శికి భద్రాద్రి జిల్లా ఇరిగేషన్‌ చీఫ్‌ఇంజనీర్‌ శ్రీనివా్‌సరెడ్డి నివేదిక పంపారు. అంతకుముందు సదరు అధికారులకు ఆయన మెమోలు జారీ చేసి.. వివరణ తీసుకున్నారు. ఈ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా, పెదవాగు ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఇసుకమేట వేసిన ప్రతి ఎకరాకు రూ.25వేలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 21 , 2024 | 03:28 AM