Share News

Phone Tapping Case: భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:42 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ-3గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Phone Tapping Case: భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌

  • గుండె సంబంధింత సమస్యలు.. వైద్యం కోసం షరతులతో 15 రోజుల బెయిల్‌

  • జీహెచ్‌ఎంసీ పరిధి దాటి వెళ్లొద్దన్న కోర్టు

హైదరాబాద్‌, సైదాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ-3గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న భుజంగరావు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పలు షరతులతో 15 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.


దీంతో సోమవారం సాయంత్రం 5.30 సమయంలో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల ఫోన్లను భుజంగరావు నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్‌ చేశారని దర్యాప్తు అధికారులు అభియోగాలను మోపిన విషయం తెలిసిందే..! ఈ ఏడాది మార్చి 23న భుజంగరావును అరెస్టు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఆయన చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.


  • రెండు సార్లు గుండెపోటు.. ఒక స్టంట్‌

బెయిల్‌ పిటీషన్‌లో తన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలను భుజంగరావు కోర్టుకు వివరించారు. గతంలో తనకు రెండు సార్లు గుండె పోటు వచ్చిందని, గత ఏడాది ఆగస్టు 9న గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేసి, స్టంట్‌ వేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో స్టంట్‌ వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఫిబ్రవరి 5న సాధారణ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లినట్లు.. మే 5న మరోసారి రావాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టవ్వడం.. కోర్టులో బెయిల్‌ రాకపోవడం వల్ల వైద్యులను సంప్రదించలేకపోయానని, మే 29తో ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలకు పంపారని చెప్పారు.


గత నెల 5న తీవ్రమైన ఛాతీ నొప్పి, గుండెలో మంటతో బాధపడ్డట్లు.. జైలులో నిపుణులైన వైద్యులు లేకపోవడంతో సరైన చికిత్స అందలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో వైద్యం కోసం నెల రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 25 వేల వ్యక్తిగత బాండ్‌, ఇద్దరి ష్యూరిటీతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. విడుదలయ్యాక జీహెచ్‌ఎంసీ పరిధి దాటి వెల్లకూడదని షరతు విధించింది. గతంలో వైద్యం చేయించుకున్న ఆస్పత్రి లేదా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది.

Updated Date - Aug 20 , 2024 | 04:42 AM