Yadadri: రేపు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ..
ABN , Publish Date - Jul 14 , 2024 | 03:40 AM
యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణపై విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 18న లక్ష్మీనరసింహస్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.
యాదాద్రి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణపై విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 18న లక్ష్మీనరసింహస్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. దాంతో ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున ఉదయం 6.05 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభించి, మళ్లీ అక్కడే ముగిసేలా గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు.
భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలి. ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ దారిలో వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట కింద టైల్స్ వేసి ఫుట్‌పాత్ నిర్మించారు. మంచినీరు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించారు. గుట్ట చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశారు.