Share News

Revenue Department: ఎల్‌ఆర్‌ఎస్‌.. ఇక ఆగదు!

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:24 AM

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Revenue Department: ఎల్‌ఆర్‌ఎస్‌..  ఇక ఆగదు!

నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండకూడదు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

  • లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు

  • రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు

  • సీఎం, రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం

  • క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు

  • రాజకీయ కారణాల వల్లనే నాలుగేళ్ల జాప్యం!

  • గత ప్రభుత్వంలో మునిసిపల్‌ శాఖ మంత్రికి

  • తెలియకుండా ధరలు పెంచుతూ సీఎస్‌ ఉత్తర్వులు

  • దుమారం రేగడంతో నెలలోపే సవరణలతో మరో జీవో

  • ఎల్‌ఆర్‌ఎస్‌పై అన్ని పిటిషన్లను మూసేసిన హైకోర్టు

  • సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలు

హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై ఇరవై రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందన్నది స్పష్టం చేస్తోంది. మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది.

2.jpg


ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణం ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు రూ.10 వేల కోట్ల దాకా ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేవని స్పష్టమైంది. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఈ ప్రక్రియపై ఎలాంటి స్టేలు లేవని వెల్లడైంది. దీంతో ఈ అంశంపై కింది స్థాయి అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి.. నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించింది.


  • నాలుగేళ్ల నిరీక్షణకు తెర..

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం నాటి ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలలపాటు దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షల దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల నుంచి 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల నుంచి 6 లక్షల దరఖాస్తులు, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల నుంచి 1.35 లక్షల దాకా దరఖాస్తులు అందాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 131 ప్రకారం ప్లాట్‌ యజమాని వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాలని, లేఅవుట్‌ డెవలపర్‌ దరఖాస్తు చేస్తే (ఎన్ని ప్లాట్లు ఉన్నా) రూ.10 వేలు ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే దీనిని సవాలు చేస్తూ జువ్వాడి సాగర్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై హైకోర్టు నుంచి గానీ, సుప్రీంకోర్టు నుంచి గానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి రాకపోవడంతో పురపాలక శాఖ 2023 మే 20న (లెటర్‌ నంబరు 14148/పీఎల్‌జీ.111/2020) ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.


మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని.. హెచ్‌ఎండీఏ పరిధిలో మాత్రమే ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి 2023 జూలై 31న జీవో 138 జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తొలుత అంటే 2020 ఆగస్టు 31న ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 131ని సవరిస్తూ 2020 సెప్టెంబరు 16నమరో జీవో (నంబరు 135)ను జారీ చేశారు. అయితే ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ఎనిమిది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు 2021 ఏప్రిల్‌ 28న కామన్‌ ఉత్తర్వులిచ్చింది. అందులో.. ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించిన అన్ని పిటిషన్లనూ మూసేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున.. అక్కడ ఏదైనా తీర్పు వస్తే దానిప్రకారం వ్యవహరించాలని పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టులో 2016 అక్టోబరు 18న రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. దీనిపైతదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది.


  • రాజకీయ కారణాల వల్లే జాప్యం!

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల విషయంలో గత ప్రభుత్వ వైఖరే నాలుగేళ్ల జాప్యానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131 ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు భారీగా పెంచడం, జీవో ఇచ్చే విషయాన్ని నాటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు చెప్పకపోవడంతో అసెంబ్లీలో దీనిపై దుమారం రేగింది. దీంతో కేటీఆర్‌ ఆ జీవోపై క్షమాపణ చెప్పి.. 2020 సెప్టెంబరు 16న సవరణలతో కూడిన జీవో నంబరు 135ను జారీ చేయించారు. అయితే ఈ వివాదంపై కొంత మంది కోర్టులను ఆశ్రయించారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టేసినా.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోలేదు.


ఎన్నికల ముందు ఈ వ్యవహారం ఎందుకనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడం, నాటి సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లి దీనిపై ఎవరూ అడగకపోవడం, ఆయన కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోకుండా ఉండిపోయింది. ప్రభుత్వం మారిన తరువాత పాత ఫీజుల ప్రకారమే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించాలని ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఆ సమయంలో కూడా ప్రజల నుంచి నిర్దిష్ట సమయంలో ఫీజులు చెల్లించాలని గడువు విధిస్తే ఎలా అంటూ విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కోర్టుల నుంచి అభ్యంతరాలు లేకపోయినా.. దానిని ఒక బూచిగా చూపించారని, ఇంత జాప్యం జరగడానికి కేవలం రాజకీయపరమైన అంశాలే కారణమని పురపాలక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.


  • పురపాలక సంచాలకుల పరిధిలో ఇదీ పరిస్థితి

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పురపాలక సంచాలకుల పరిధిలో ఉన్న మునిసిపాలిటీలు, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల నుంచి 15,07,505 దరఖాస్తులు రాగా.. అందులో 4,09,059 దరఖాస్తులను ప్రాసెస్‌ చేశారు. 18,703 దరఖాస్తులను తిరస్కరించారు. 69,972 దరఖాస్తులకు సంబంధించి షార్ట్‌ఫాల్‌ లేఖలు రాశారు. మరో 61,571 మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని లేఖలు పంపారు. 7513 దరఖాస్తులకు ఆమోదం తెలిపి రూ.51.83 కోట్ల ఫీజు వసూలు చేశారు.

Updated Date - Aug 04 , 2024 | 03:24 AM