Medical Colleges: ఒక్క చాన్స్ ప్లీజ్..
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:27 AM
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వబోమని జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు మరో అవకాశం ఇవ్వాలని సర్కారు అప్పీల్‌కు వెళ్లింది.
కొత్త మెడికల్ కాలేజీల్లో లోటుపాట్లు
సరిదిద్దుకుంటామని ఎన్‌ఎంసీకి సర్కారు అప్పీల్
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వబోమని జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు మరో అవకాశం ఇవ్వాలని సర్కారు అప్పీల్‌కు వెళ్లింది. వర్చువల్ తనిఖీలు చేసే సమయానికి లోటుపాట్లను సవరించుకుంటామని అందులో పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీ ల్లో లోటుపాట్ల గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా అధ్యాపకులు లేరని, అనుమతులివ్వబోమని ఎన్‌ఎంసీ ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లకు జూలై తొలివా రంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎంసీ నిబంధన మేరకు 50 సీట్లతో ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి.
ఒక్కోచోట 50 ఎంబీబీఎస్ సీట్లు ఉండేలా ఏర్పాటు చేస్తున్న 8 కాలేజీల్లో అధ్యాపకులే లేరు. దాంతో వైద్య ఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. ఈ కళాశాలలకు పదోన్నతులపై అసోసియేట్ ప్రొఫెసర్లను పంపించింది. నిబంధనలకు తగ్గట్లు 6కాలేజీల్లో 20 మంది వరకు అసోసియేట్ ప్రొఫెసర్లు చేరారు. కానీ గద్వాల, నారాయణపేట్ మె డికల్ కాలేజీల్లో చేరేందుకు మాత్రం అసోసియేట్ ప్రొఫెసర్లు ఆసక్తి చూపలేదు. పదోన్నతులు తీసుకున్నారు కానీ హైదరాబాద్‌కు దూరంగా ఉండే ఆ కళాశాలల్లో పనిజేయబోమని తేల్చిచెప్పారు. తమను బలవంతంగా అక్కడికి పంపారంటూ హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకునే పనిలో ఉన్నారు.