Hyderabad: 35 మందికి నామినేటెడ్ పదవులు..
ABN , Publish Date - Jul 09 , 2024 | 03:34 AM
రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అధికార పార్టీ నేతల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్‌పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పొరేషన్లు,ఫెడరేషన్లకు చైర్‌పర్సన్ల నియామకం
శాతవాహన, కాకతీయ అథారిటీలకు చైర్మన్లు
తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్‌పర్సన్
అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్
మార్చిలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు
ఓసీ-18, బీసీ-11, ఎస్టీ-3, ఎస్సీలకు ఒకటి
ఉత్తర్వులు జారీ.. బాధ్యతలు చేపట్టిన పలువురు
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అధికార పార్టీ నేతల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్‌పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 34 ప్రభుత్వరంగ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను, ఒక కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 442 నుంచి 448 వరకు మొత్తం ఏడు జీవోలను జారీ చేశారు. వాస్తవానికి 37 కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమిస్తూ ప్రభుత్వం మార్చి 15నే జీవోలు సిద్ధం చేసింది. కానీ, ఆ సమయంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. కోడ్ అమల్లోకి రావడంతో జీవోల జారీని నిలిపివేసింది.
దీంతో ఈ పదవులకు ఎంపికైన వారు అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో నాటి జాబితాలో కొందరి ఎంపికపై నేతల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్.. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి.. నియామకాలను ఖరారు చేశారు. ఈ మేరకు 35 మంది నియామకాలపై ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. చైర్‌పర్సన్లుగా నియమితులైన వారందరి పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి రెండేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. ఈ 35 సంస్థల్లో శాతవాహన అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ, కాకతీయ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ కూడా ఉన్నాయి. కాగా, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీ ఐఐసీ) చైర్మన్‌గా టి.నిర్మలా జగ్గారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మీజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య సహా దాదాపు అందరికీ ఇంతకుముందు ప్రకటించిన కార్పొరేషన్ల బాధ్యతలనే అప్పగించారు.
అభ్యంతరాలు.. మార్పులు
మార్చి నెలలో చేపట్టిన 37 మంది నియామకాల్లో.. మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారద, శాతవాహన డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్‌గా కె.నరేందర్‌రెడ్డి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కాకతీయ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్‌గా వెంకట్రామిరెడ్డి ఎంపికపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతోపాటు బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ముగ్గురు నేతలను నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సీహెచ్.జగదీశ్వర్‌రావును ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేయగా.. ఆయన దానికి బదులుగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భేటీ సందర్భంగా చర్చ జరిగింది.
జాబితాలో మార్పులు చేపడితే గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అవే పేర్లతో నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. జగదీశ్వర్‌రావు.. ఎమ్మెల్సీ సీటునే కోరుకుంటుండడంతో ఆయన స్థానంలో ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మువ్వా విజయ్‌బాబును నియమించారు. వాస్తవానికి విజయ్‌బాబును హౌసింగ్ ఫెడరేషన్‌కు చైర్మన్‌గా నియమించాలనుకున్నారు. ఇక జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తొలుత డెయిరీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆ తర్వాత ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కావడంతో సామాజికవర్గం రీత్యా ఆయనను ఆ పోస్టులో నియమించారు. అలాగే ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ముందుగా కోతక్ నాగును అనుకుని.. తాజా ఉత్తర్వుల్లో కోట్నాక తిరుపతిని నియమించారు. ఇక మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారద నియామకానికి సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంది.
బాధ్యతలు స్వీకరించిన పలువురు
నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా ఎంఏ ఫహీం, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా మెట్టు సాయికుమార్, రోడ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్‌రెడ్డి రాంరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మన్నె సతీశ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
18 పోస్టులు అగ్రకులాలకే
వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్‌పర్సన్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ 35 మందిలో 18 మంది అగ్రకులాలకు చెందినవారే ఉన్నారు. వీరిలో 12 మంది రెడ్డి, ముగ్గురు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఉండగా, వెలమ, వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక ఎస్టీలకు మూడు, ఎస్సీలకు ఒకటి చొప్పున పదవి దక్కింది. ముస్లిం వర్గానికి మూడు పదవులు దక్కాయి. బీసీల్లో గౌడ సామాజికవర్గానికి నాలుగు పదవులు, ముదిరాజ్, మున్నూరుకాపు సామాజికవర్గాలకు రెండు చొప్పున, పద్మశాలి, లింగాయత్, వడ్డెర సామాజికవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున లభించాయి. అయితే కొద్ది రోజుల్లోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ కానున్నాయని, సామాజిక కూర్పులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిలో సరిదిద్దుతామని పార్టీ నాయకత్వం చెబుతోంది.