Share News

High Schools: డగ్స్‌ విద్యార్థుల దరి చేరకుండా.. హైస్కూళ్లలో ‘ప్రహరీ సంఘాలు’

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:21 AM

విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

High Schools: డగ్స్‌ విద్యార్థుల దరి చేరకుండా.. హైస్కూళ్లలో ‘ప్రహరీ సంఘాలు’

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఘాల ఏర్పాటుకు అనుమతిస్తూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం, పాఠశాలల పరిసరాల్లో వాటి లభ్యత, స్మగ్లింగ్‌, విక్రయాలు లేకుండా చూడడం ఈ సంఘాల లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. వీటిని అన్ని హైస్కూళ్లలో ఏర్పాటు చేయాలని తెలిపింది. డ్రగ్స్‌ నిరోధానికి తమకు అనుకూలమైన వ్యూహాత్మక పద్ధతులు రూపొందించుకోవాలని పేర్కొంది.


డ్రగ్స్‌కు దగ్గరవుతున్న పిల్లలపై ఈ సంఘం సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, వారికి అవగాహన కల్పించాలని తెలిపింది. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాలో ఇరుక్కున్న పిల్లలను రక్షించాలని, పాఠశాల పరిసరాల్లో వాటి స్మగ్లింగ్‌, అమ్మకాలపై నిఘా పెట్టాలని సూచించింది. ఈ సంఘం అధ్యక్షుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు/పిన్సిపాల్‌, ఉపాధ్యక్షుడిగా సీనియర్‌ ఉపాధ్యాయుడు ఉండాలని తెలిపింది. 6 నుంచి 10 వరకు ఒక్కో తరగతి నుంచి ఇద్దరేసి చుకురైన విద్యార్థులను సభ్యులుగా చేర్చాలని, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సంఘం, తల్లిదండ్రుల సంఘం నుంచి ఒక్కో ప్రతినిధిని, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక పోలీసును కూడా తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని స్కూళ్లపై మరింత దృష్టి పెట్టాలని తెలిపింది.

Updated Date - Jul 14 , 2024 | 03:21 AM