Share News

Govt Schemes: రైతుల కోసం కొత్త స్కీమ్.. ప్రతి నెలా రూ.3 వేలు.. పూర్తి వివరాలు ఇవే..

ABN , Publish Date - Dec 12 , 2024 | 10:51 AM

Govt Schemes: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొచ్చాయి. ఎప్పటికప్పుడు రైతుల బాగు కొరకు నయా స్కీమ్స్ ప్రవేశపెడుతుంటాయి. ఇదే క్రమంలో వారికి ప్రతి నెలా రూ.3 వేలు అందించేలా ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Govt Schemes: రైతుల కోసం కొత్త స్కీమ్.. ప్రతి నెలా రూ.3 వేలు.. పూర్తి వివరాలు ఇవే..

అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథకాలు తీసుకొచ్చాయి. ఎప్పటికప్పుడు రైతుల బాగు కొరకు నయా స్కీమ్స్ ప్రవేశపెడుతుంటాయి. అయితే ఏ పథకమైనా వాళ్లు వ్యవసాయం చేస్తున్నంత వరకే అండగా నిలిచేది. కానీ సాగు మానేశాక కూడా అన్నదాతలకు సపోర్ట్‌గా ఉండే ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతన్నలకు ప్రతి నెలా రూ.3 వేలు అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ స్కీమ్? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..


సాగును ప్రోత్సహించేందుకు..

రైతులను సాగు దిశగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్. ఈ పథకం కింద అర్హులైన అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తుంది కేంద్ర సర్కారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున వారి అకౌంట్లలో వేస్తుంది. ఇక, రైతన్నలు వృద్ధాప్యంలో వ్యవసాయం చేయకున్నా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.


ఆ వయసు దాటాకే పెన్షన్

వృద్ధాప్యంలో చాలా మంది రైతులు సాగు చేయలేని పరిస్థితి. వయసు మీద పడటం, శరీరం సహకరించకపోవడం, అనారోగ్యం లాంటి కారణాల వల్ల సాగు చేయలేకపోతారు. అలాగే వ్యవసాయ పనులకు దూరంగా ఉంటుంటారు. ఎలాంటి ఆదాయ వనరు లేక చాలా మంది ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కిసాన్ మన్‌ధన్ యోజనను తీసుకొచ్చింది కేంద్రం. ఈ స్కీమ్ కింద 60 సంవత్సరాలు నిండిన అన్నదాతలు.. ప్రతి నెలా రూ.3 వేల చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతన్నలు ఇందులో చేరేందుకు అర్హులు. భూరికార్డుల్లో తమ పేరు ఉండి.. 2 హెక్టార్ల దాకా సాగు చేసేందుకు వీలుగా భూమి ఉన్నవారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నా 60 ఏళ్లు దాటాకే పెన్షన్ వస్తుంది.


వీళ్లు అనర్హులు..

నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్‌ఐ స్కీమ్, ఈపీఎఫ్‌వో పరిధిలో ఉన్నవారు, టాక్స్ పేయర్లు, ఉన్నత స్థితి కలిగిన వారు పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన స్కీమ్‌లో చేరేందుకు అనర్హులు. ఈ పథకంలో పెన్షన్ అందేవరకు అన్నదాతలు కొంత ప్రీమియం కట్టాలి. వయసును బట్టి ప్రీమియం అమౌంట్ ఉంటుంది. రైతు చెల్లించిన మొత్తమే సర్కారు కూడా బీమా కంపెనీకి తనవంతుగా నగదు జమ చేస్తుంది. ఫొటో, నివాస ధృవీకరణ పత్రం, వయసు నిర్ధారణ, ఆధార్ కార్డ్, సాగు భూమి, ఆదాయం లాంటి వివరాలు, పత్రాలను రైతులు సమర్పించాలి. కామన్ సర్వీస్ సెంటర్స్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


Also Read:

రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. మహిళల కోసం మరో కొత్త స్కీమ్

నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ దొందూదొందే..

మోహన్‌ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు

For More Telangana And Telugu News

Updated Date - Dec 12 , 2024 | 11:07 AM