Hyderabad: గ్రేస్ మార్కులు చట్టబద్ధమైన ఆకాంక్ష కాదు!
ABN , Publish Date - Jun 20 , 2024 | 05:32 AM
గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేసే చట్టబద్ధమైన హక్కు పిటిషనర్లకు (ఎంబీబీఎస్ విద్యార్థులు )లేదని.. అయినా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వారికి గ్రేస్ మార్కులు కలిపే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), కాళోజీ హెల్త్ వర్సిటీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అయినా పిటిషనర్ల దరఖాస్తు పరిశీలించండి
ఎన్‌ఎంసీ, కాళోజీ వర్సిటీలకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేసే చట్టబద్ధమైన హక్కు పిటిషనర్లకు (ఎంబీబీఎస్ విద్యార్థులు )లేదని.. అయినా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వారికి గ్రేస్ మార్కులు కలిపే అంశాన్ని పరిశీలించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), కాళోజీ హెల్త్ వర్సిటీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఆన్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్-1997 (పాత రెగ్యులేషన్స్) ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులకు గరిష్ఠంగా 5 గ్రేస్ మార్కులు ఇవ్వవచ్చని ఉంది. కాగా ఈ గ్రేస్ మార్కుల రెగ్యులేషన్‌ను 2023లో సవరిస్తూ దానిని తొలగించారు.
2022లో తాము ఎంబీబీఎ్‌సలో చేరామని.. నూతన రెగ్యులేషన్ తీసుకురావడానికి ముందే కోర్సులో చేరిన తమకు వర్తించదని.. తమకు గ్రేస్ మార్కులు ఇచ్చేలా ఎన్‌ఎంసీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆర్య సహా పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు నమోదు చేసుకున్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం.. ఏదిఏమైనా ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గ్రేస్ మార్కులు కలిపి తమను రెండో సంవత్సరం తరగతులకు అనుమతించాలన్న పిటిషనర్ల దరఖాస్తులను పరిశీలించాలని కాళోజీ హెల్త్ వర్సిటీ తదితరులను హైకోర్టు ఆదేశించింది.