TG: ప్రభుత్వేతర వైద్య సిబ్బంది వేతనాలకు గ్రీన్ చానల్
ABN , Publish Date - May 23 , 2024 | 03:19 AM
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్ చెల్లించేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
వైద్య విభాగాధిపతులకే నిధుల కేటాయింపు
వారి ద్వారానే స్టైపెండ్, వేతనాల చెల్లింపు
ఆర్థిక శాఖకు ప్రతిపాదించిన వైద్య శాఖ
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్ చెల్లించేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఆర్థికశాఖకు పంపింది. ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకున్నారు. గ్రీన్ చానల్ ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఇటీవలే ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గ్రీన్ చానల్ ఏర్పాటుకు ఆర్థికశాఖ అనుమతిస్తే... పీజీ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు ప్రతి నెలా మొదటి వారంలోనే స్టైపెండ్, గౌరవ వేతనాలు అందుతాయి.
వీటితో పాటు జూనియర్ డాక్టర్ల హాజరు పట్టికను కూడా ప్రతి నెలా 20వ తేదీ వరకు డీఎంఈ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కాలేజీలు, బోధనాస్పత్రుల నుంచి అటెండెన్స్ సకాలంలో వస్తేనే వేతనాలను సకాలంలో విడుదల చేయడానికి వీలుంటుంది. అందుకే విధిగా అన్ని కాలేజీలు సకాలంలో హాజరు వివరాలను పంపాలని డీఎంఈ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. వైద్యవిద్య సంచాలకుడి పరిధిలోని ప్రభుత్వ వైద్య కాలేజీలు, బోధనాస్పత్రుల్లో పనిజేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాల విషయంలో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తే ఇక నుంచి మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లోని విభాగాధిపతులే ఈ స్టైపెండ్, గౌరవ వేతనాలను చెల్లిస్తారు. ఆ తర్వాతనే వేతనాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థికశాఖకు పంపుతారు. ఇందుకోసం ముందుగానే విభాగాధిపతులకు నిధులను కేటాయిస్తారు. చెల్లింపులు ఆలస్యమయ్యే ప్రతీ సారీ జూనియర్ డాక్టర్లు తదితరులు వైద్య సేవలను నిలిపివేస్తామని హెచ్చరించడం పరిపాటిగా మారింది. తాజాగా బుధవారం నుంచి కూడా వైద్య సేవలు నిలిపివేస్తామని డీఎంఈ డాక్టర్ వాణికి నోటీసులిచ్చారు. అయితే డీఎంఈ వారితో చర్చలు జరిపిన అనంతరం విధుల బహిష్కరణ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారి కష్టాలు తీరినట్లేనని భావిస్తున్నారు.
ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగులకు సైతం
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిఽధిలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద దాదాపు 45 వేల మంది పనిజేస్తున్నారు. ఇందులో వైద్యులు, ఎఎన్‌ఎమ్, ఇతర పారామెడికల్ సిబ్బందితో పాటు ఆశాలు కూడా ఉన్నారు. వీరికి కూడా ప్రతీనెలా సకాలంలో జీతాలందడం లేదు. వీరందరికీ కలపి ప్రతీనెలా సుమారు రూ.105 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ జీతభత్యాల్లో 60ు కేంద్రం ఎన్‌హెచ్‌ఎమ్ కింద పంపుతుంది. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదు. దాంతో ఎన్‌హెచ్‌ఎమ్ స్కీమ్ కింద పనిజేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలివ్వలేకపోతున్నారు. గత ఆరు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వమే జీతాలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఇంకా రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరికి కూడా సకాలంలో జీతాలు గ్రీన్ ఛానెల్ ద్వారా అందేలా వైద్యశాఖ ప్రతిపాదనలు పంపింది. మరో వారం పది రోజుల్లోపు పెండింగ్‌లో ఉన్న పాత జీతాలను చెల్లించే అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.