Share News

గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష.. అరగంట ముందే గేట్లు క్లోజ్‌!

ABN , Publish Date - May 30 , 2024 | 04:15 AM

గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష.. అరగంట ముందే గేట్లు క్లోజ్‌!

  • జూన్‌ 9న ఉదయం 10.30 నుంచి.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. శనివారం(జూన్‌ 1) నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. గతంతో పోలిస్తే.. పరీక్ష నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థి ఫొటోను ముద్రిస్తున్నారు. దీంతోపాటు.. అభ్యర్థి పేరు, హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు కూడా ఓఎంఆర్‌ షీట్‌పై ఉంటాయి. దీని వల్ల హాల్‌టికెట్‌ బబ్లింగ్‌లో జరిగే పొరపాట్లకు అడ్డుకట్ట పడుతుందని టీజీపీఎస్సీ భావిస్తోంది. గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి ఇంతకు ముందు రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు జరిగి, రద్దయిన విషయం తెలిసిందే.


మొదటిసారి 2022 అక్టోబరులో జరిగిన పరీక్షను ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా రద్దు చేశారు. ఆ తర్వాత 2023 జూన్‌లో జరిగిన పరీక్షను బయోమెట్రిక్‌ తీసుకోకపోవడం, ఇతర నిబంధనలను పాటించలేదనే కారణంతో హైకోర్టు రద్దుచేసింది. దీంతో రేవంత్‌ సర్కారు ఎలాంటి విమర్శలకు తావులేకుండా, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. దాంతో అధికారులు మరికొన్ని పోస్టులను చేర్చి, కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చారు. పరీక్ష నిర్వహణలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్‌ 9న ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని.. 10 గంటలు దాటితే లోనికి అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకుంటామన్నారు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే అభ్యర్థులకు ఓఎంఆర్‌ షీట్లను ఇస్తారని, బుక్‌లెట్‌లను 10.30కు బెల్‌ మోగిన తర్వాతే తెరవాల్సి ఉంటుందని చెప్పారు.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు

  • పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్లు, పేపర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, చేతిగడియారం, ఎక్కాల పుస్తకం, లాగరిథమ్‌ పుస్తకం, పర్సు, హ్యాండ్‌బ్యాగ్‌, రైటింగ్‌ పాడ్స్‌, ఆభరణాలు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, రికార్డింగ్‌ పరికరాలకు అనుమతి ఉండదు.

  • అభ్యర్థులు బూట్లను ధరించి పరీక్షకు రాకూడదు. చెప్పులను మాత్రమే ధరించాలి.

  • అభ్యర్థులు చేతులకు మెహిందీ, తాత్కాలిక టాటూ్‌సను వేసుకోకూడదు.

  • విలువైన వస్తువులను భద్రపరిచే ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఉండవు.

  • పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బెల్‌ మోగించి లేదా ఇన్విజిలేటర్‌ ద్వారా సమయాన్ని చెబుతారు.

Updated Date - May 30 , 2024 | 04:15 AM