Harish Rao: ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు రేవంత్ కుట్రలు
ABN , Publish Date - May 24 , 2024 | 03:27 AM
ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు.
అందుకే హైకోర్టులో సరైన వాదనల్లేవ్..
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలి: హరీశ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. ఓ వ్యక్తి ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టుకెళ్లగా రిజర్వేషన్ల తగ్గింపు కుట్రలో భాగంగా ప్రభుత్వం వాదనలు సరిగ్గా వినిపించడం లేదని ఆరోపించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, తొర్రూరు మండలం వెల్లికట్టె, హనుమకొండ హంటర్ రోడ్‌లో నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీనీ కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీలకు పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పాలని, ఎమ్మెల్సీ ఉపఎన్నికలో రాకేశ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని సర్కారును హరీశ్ డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్‌లో, భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు చేసిందేం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు.