Harish Rao : ఐటీఐలు, గురుకులాల సమస్యలపై సర్కారు కినుక
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:23 AM
రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతుల్లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని, వాటి పరిష్కారంపై కినుక వహిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతుల్లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని, వాటి పరిష్కారంపై కినుక వహిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఐటీఐల పరిస్థితి అధ్వానంగా ఉందని మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
కొన్నిచోట్ల తరగతి గదుల్లోకి వాననీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సిబ్బంది కొరతతో టాయిలెట్లు, పారిశుధ్య నిర్వహణ సరిగాలేక విద్యార్థులు అవస్థ పడుతున్నారన్నారు. గురుకులాల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత, పాముకాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో ఓ విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలను సత్వరం పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.