Harish Rao : ఓట్ల కోసం ఒట్లు పెట్టారు
ABN , Publish Date - Oct 30 , 2024 | 04:37 AM
రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
కొత్త పథకాలు ఇవ్వరు.. పాతవి అమలు చేయరు
రైతు భరోసా, పింఛన్లు ఏమయ్యాయి?: హరీశ్
మహబూబ్‌నగర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి రుణమాఫీ అర్హత ఉంటే.. 20 లక్షల మందికి మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. పెళ్లి కాలేదని, చనిపోయిన భర్తకు ఆధార్‌లేదని, రేషన్ కార్డు లేదని కొర్రీలు పెట్టారని విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రైతాంగ నిరసన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్. సీఎం అయ్యాక ఒక పంటకు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామన్నారని, ఇప్పుడు సన్నాలు అని చెప్పి, వాటిని కూడా కొనుగోలు చేయడంలేదని విమర్శించారు. రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఆగిపోయాయని, కొత్త పథకాలు రాలేదని అన్నారు.
ఏపీలో ఇప్పటికే కొత్త పింఛన్లు ఇస్తున్నారని, ఇక్కడ మాత్రం పింఛన్లు పెంచలేదని తెలిపారు. కాగా, ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం 17 వేల మంది స్పెషల్ పోలీసులను అవమానించడమేనని హరీశ్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. స్పెషల్ పోలీసులను సస్పెండ్, డిస్మిస్ చేయడం తగదని.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయని, దీంతో ఆర్థికాభివృద్థి ప్రశ్నార్థకంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికను ఎక్స్‌వేదికగా పోస్ట్ చేస్తూ.. కాంగ్రెస్ పాలనలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయని తెలిపారు.