Share News

Political Criticism: నా వెనకే ఉన్నావ్‌.. నిక్కి నిక్కి చూశావ్‌

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:24 AM

‘‘నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఊరేగింపులో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా టీఆర్‌ఎ్‌సలోనే ఉన్నావ్‌.

Political Criticism: నా వెనకే ఉన్నావ్‌.. నిక్కి నిక్కి చూశావ్‌

  • నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఊరేగింపులో ఉన్నావ్‌

  • నేను రాజీనామా చేసినప్పుడూ టీఆర్‌ఎ్‌సలోనే ఉన్నావ్‌

  • రేవంత్‌ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఊరేగింపులో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా టీఆర్‌ఎ్‌సలోనే ఉన్నావ్‌. నా వెనకే ఉన్నావ్‌.. నిక్కినిక్కి చూశావ్‌’’ అని రేవంత్‌ను విమర్శిస్తూ.. అందుకు సంబంధించిన ఓ వీడియోను మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అప్పుడు ఇదంతా ఆయన కళ్లముందు జరిగిందని.. ఇవేమీ తెలియనట్లు రేవంత్‌రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలోనూ ఆయన హుందాగా ప్రవర్తించడం లేదని, చిల్లరగా మాట్లాడే చీప్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.


తెలంగాణ ఉద్యమంలో పదవులను త్యజించిన చరిత్ర తమదని తెలిపారు. తనకు మంత్రి పదవి ఎవరి భిక్షవల్లనో రాలేదని, సోనియాగాంధీ సూచన మేరకు అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేరాం తప్ప.. పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి ఎక్కడిదని.. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర ఆయనదని హరీశ్‌రావు విమర్శించారు.


కాగా, కొలువులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్షా అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా సీఎంకు చీమ కుట్టినట్టైనా లేదని హరీశ్‌ రావు విమర్శించారు. చాయ్‌ తాగేలోపు జీవో ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూడొచ్చు అంటూ ఎన్నికల సమయంలో రేవంత్‌ హామీ ఇచ్చిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా రేవంత్‌రెడ్డికి చాయ్‌ తాగే సమయం కూడా దొరకడం లేదా?’’ అని ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని సీతక్క చేసిన డిమాండ్‌ కూడా ఆ వీడియోలో ఉంది.

Updated Date - Aug 02 , 2024 | 04:24 AM