Share News

Harish Rao: నేను నిద్రపోను.. సీఎంను నిద్రపోనివ్వను

ABN , Publish Date - Sep 28 , 2024 | 03:44 AM

నూటికి నూరు శాతం రైతు రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తాను నిద్రపోనని, సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు.

Harish Rao: నేను నిద్రపోను.. సీఎంను నిద్రపోనివ్వను

  • రుణ మాఫీ పూర్తి చేసే వరకూ వదిలిపెట్టను

  • రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తాం: హరీశ్‌

సిద్దిపేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నూటికి నూరు శాతం రైతు రుణ మాఫీ పూర్తయ్యే వరకూ తాను నిద్రపోనని, సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. అవసరమైతే రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతానని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాకు ఆయన హాజరయ్యారు. రుణమాఫీ అందని రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ రుణాలు పొందిన వారిలో చాలా మందికి మాఫీ కాలేదనడానికి ఈ ధర్నాకు వచ్చిన రైతులే నిదర్శనమన్నారు.


ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రుణ మాఫీ అందని రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తానని ప్రకటించారు. మరోవైపు.. వానాకాలం సీజన్‌ పంటలు చేతికొచ్చే సమయం వచ్చినా.. రైతు భరోసా డబ్బులు విడుదల చేయలేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సన్నాల బోసన్‌ కూడా పెద్ద బోగస్సే అని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్ని ఎగ్గొట్టడమే రేవంత్‌ పాలసీ అని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి తన ఇంటి పేరును ఎనుములకు బదులు ఎగవేతలగా మార్చుకోవాలని సూచించారు.

Updated Date - Sep 28 , 2024 | 03:44 AM