Harish Rao: ఆర్‌బీఐ నివేదిక కాంగ్రెస్‌కు చెంపపెట్టు
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:40 AM
పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రె్‌సకు ఆ నివేదిక చెంపపెట్టు అని వాఖ్యానించారు.
పదేళ్లలో మేం చేసిన అప్పు రూ.3.22లక్షల కోట్లు మాత్రమే
రేవంత్ మాటల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గాయి: హరీశ్‌రావు
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రె్‌సకు ఆ నివేదిక చెంపపెట్టు అని వాఖ్యానించారు. తెలంగాణ దివాళా తీసిన రాష్ట్రం కాదని, దివ్యంగా వెలిగిన రాష్ట్రమని ఆర్‌బీఐ తేల్చిచెప్పిందన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నదని విమర్శించారు. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3 లక్షల 22 వేల 499 కోట్లు మాత్రమే అప్పు చేసిందని పేర్కొన్నారు. కానీ రూ.7లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి ఆరోపణల వల్లనే తెలంగాణకు పెట్టుబడులు తగ్గాయని, అప్పుల రాష్ట్రంగా చూస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ సంపద పెంచడమేగాకుండా రెట్టింపు చేశారనే విషయాన్ని ఆర్‌బీఐ రిపోర్టులో ఉందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చడంతోపాటు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమం, అభివృద్ధి పేరిట పేదలకు పంచారని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికైనా విషప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. 2014వరకు తెలంగాణ జీఎ్‌సడీపీ రూ.4.3 లక్షల కోట్లు ఉంటే 2023-24వరకు రూ.15.01లక్షల కోట్లకు చేరిందని, 249ు వృద్ధిరేటు పెరిగిందని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం కూడా రూ.1,03,889 నుంచి రూ.3,56,564కు పెరిగి 243ు వృద్ధిరేటు నమోదు చేసుకుందని తెలిపారు. 91లక్షల టన్నులు మాత్రమే పండిన ధాన్యం ఉత్పత్తిని పదేళ్లలో 2కోట్ల టన్నులకు చేర్చిన విషయాన్ని ఆర్‌బీఐ పొందుపర్చడం తమకు గర్వకారణమని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ సృష్టించిన ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగు చూడనివ్వడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు.
సమగ్ర శిక్షా ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పోరాటం
సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హరీశ్ తెలిపారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో నాలుగు రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు దీక్ష కొనసాగిస్తున్నారు. వారి దీక్షకు హరీశ్‌రావు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.