Share News

Warangal: ఎర్రబెల్లి.. కాంగ్రెస్‌లోకి?

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:27 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లా సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్‌ ఓకే చెప్పారా? బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

Warangal: ఎర్రబెల్లి.. కాంగ్రెస్‌లోకి?

  • సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం

  • ఎర్రబెల్లిని చేర్చుకోవద్దని.. పలువురి ఒత్తిడి

వరంగల్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్‌ ఓకే చెప్పారా? బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పని చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి మధ్య నోటుకు ఓటు కేసు సమయంలో విభేదాలు తలెత్తాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరి, ఐదేళ్లు మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్‌ఎస్‌ కేడర్‌ నైరాశ్యంలో ఉండగా.. కీలక నేతలు తలోదారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్‌ కూడా ఇదే అదనుగా బీఆర్‌ఎ్‌సలోని కీలక నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.


ఈ నేపథ్యంలో తొలుత ఇద్దరు మంత్రులతోపాటు ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి ఎర్రబెల్లిని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినా.. సీఎం రేవంత్‌ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరటమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్‌ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడటంతో ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు పెద్ద దిక్కుగా నిలిచారు. అలాంటి దయాకర్‌రావును పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఎర్రబెల్లి చేరిక విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. అయితే, అప్పటికే ఎర్రబెల్లి.. కొందరు నేతల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి రాయబారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది.


గతంలో జరిగింది వదిలేయాలని, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అలా జరిగిందని, భవిష్యత్తులో ఎర్రబెల్లి ఉపయోగపడుతారని సదరు నేతలు పేర్కొనగా.. రేవంత్‌ కూడా సమ్మతించినట్లు తెలుస్తోంది. కాగా, వరంగల్‌లోని ఇద్దరు, ముగ్గురు నేతలు మాత్రం ఎర్రబెల్లిని పార్టీలో చేర్చుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులతో ఎర్రబెల్లికి దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది. వారితో పాటు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు.. ఎర్రబెల్లిని కాంగ్రె్‌సలోకి తీసుకొచ్చేందుకు కీలక నేతలే ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.


బీఆర్‌ఎ్‌సను వీడను: ఎర్రబెల్లి

వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో బుధవారం రాత్రి దయాకర్‌రావు ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా.. ఆయన పార్టీ మారేందుకే సమావేశం పెట్టారని ప్రచారం జరిగింది. అయితే, తాను కాంగ్రె్‌సలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు కావాలనే తనను బద్నాం చేయాలని చూస్తున్నారని, ఆ పార్టీలో చేరు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2028లో తెలంగాణ సీఎం అయ్యేది కేసీఆరేనని, తాను బీఆర్‌ఎ్‌సను వీడేది లేదన్నారు. పర్వతగిరిలో నిర్వహించిన సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి పోలైన ఓట్లపై సమీక్షించామని, మరే ఇతర అంశాలు చర్చకు రాలేదని వెల్లడించారు.

Updated Date - Jun 21 , 2024 | 04:27 AM