Share News

High Court: కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ నేడు

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:58 AM

ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ కారు రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ ఈనెల 21న హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

High Court: కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ నేడు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ కారు రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ ఈనెల 21న హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తొలుత విచారించిన జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని, దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. తమది రెగ్యులర్‌ బెంచ్‌ కానందున తదుపరి విచారణ రెగ్యులర్‌ రోస్టర్‌ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.


ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై ఏసీబీ అధికారులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పురపాలకశాఖ కార్యదర్శి దానకిషోర్‌ సైతం కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దానకిషోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగనున్న నేపధ్యంలోనే ఇప్పటివరకు ఏ1 కేటీఆర్‌, ఏ2 అర్విందకుమార్‌, ఏ3 బిఎల్‌ఎన్‌ రెడ్డిలకు ఏసీబీ నోటీసులు ఇవ్వలేదని సమాచారం. వీరందరికి నోటీసులు జారీ చేయడానికి కావాల్సిన పూర్తి స్ధాయి సమాచారాన్ని మాత్రం అధికారులు సిద్ధం చేసుకున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 04:58 AM