Share News

Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు..

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:56 AM

రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.

Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు..

  • 20వ తేదీ వరకు ఎల్లో అలెర్ట్‌

  • హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ వానలు

  • కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో 16.9 సెం.మీ.

  • ఆసిఫాబాద్‌లో పిడుగులు పడి ఇద్దరి మృతి

  • ఎల్లుండి నుంచి కృష్ణాకు వరదలు పెరిగే చాన్స్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శని, ఆదివారాల్లో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆదివారం 24 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఈనెల 20 వరకు రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వానలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల పంటపొలాలు నీట మునిగాయి. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో అత్యధికంగా 16.9 సెం.మీ., మెదక్‌ జిల్లా కేంద్రంలో 12.9, సంగారెడ్డి జిల్లా చౌట్కుర్‌లో 10.5 సెం.మీ., మెదక్‌ జిల్లా పాతూరులో 9.3, జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 9.2, కరీంనగర్‌ జిల్లా ఈదులగట్టెపల్లిలో 8.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షానికి మెదక్‌ జిల్లా కేంద్రం జలమయమైంది. అదే జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో పంట చేలు నీటమునిగాయి.


ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగులు పడి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి చెందారు. ఆసిఫాబాద్‌ మండలం నందుపా గ్రామానికి చెందిన దౌత్రే అంజన్న(20), కెరమెరికి చెందిన చౌదరి రమేశ్‌ (30) పిడుగుపాటుకు మృతి చెందారు. నిజామాబాద్‌, కామారెడ్డిలో కురిసిన భారీ వర్షంతో పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. హైదరాబాద్‌లో లంగర్‌హౌస్‌, పటాన్‌చెరు, మెహిదీపట్నం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.


  • ఎల్లుండి నుంచి కృష్ణాకు వరదలు!

మహారాష్ట్రలోని కృష్ణాబేసిన్‌ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమవారం నుంచి ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులకు నిలకడగా వరద వచ్చి చేరుతుండటంతో ఆల్మట్టి నుంచి పులిచింతల వద్ద ఉన్న జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పాదన జోరుగా జరుగుతోంది. శుక్రవారం ఆల్మట్టిలో జలవిద్యుత్తు కోసం 14 వేల క్యూసెక్కులు, నారాయణపూర్‌లో 4,667, ఉజ్జయినిలో 1,600, జూరాలలో 32 వేలు, తుంగభద్రలో 4,688, శ్రీశైలంలో 68 వేలు, నాగార్జునసాగర్‌లో 28 వేలు, పులిచింతలలో 15 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.


ఇక తుంగభద్ర ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ గేటు పెట్టే ప్రయత్నాలు శుక్రవారం కూడా సఫలీకృతం కాలేదు. శనివారం కల్లా స్టాప్‌లాగ్‌ గేటు పెట్టే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రాజెక్టుల్లో నిల్వలు పెరగలేదు. సింగూరుకు 391 క్యూసెక్కులు, ఎస్సారెస్పీకి 10,680, కడెం ప్రాజెక్టుకు 2,539, శ్రీపాద ఎల్లంపల్లికి 7,741 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లి నుంచి 3,602 క్యూసెక్కులను మిడ్‌మానేరుకు ఎత్తిపోస్తున్నారు. ఇక, మేడిగడ్డ బ్యారేజీకి 1.57లక్షలు, అన్నారం బ్యారేజీకి 2,500 క్యూసెక్కులు వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.

Updated Date - Aug 17 , 2024 | 03:56 AM