Share News

High Court: ఎక్కడ చెట్లు కొట్టేశారో.. అక్కడే మొక్కలు నాటండి!

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:08 AM

అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికి అటవీ అధికారులకు దొరికిపోయిన నిందితులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ పచ్చదనం పెంచడానికి.. 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.

High Court: ఎక్కడ చెట్లు కొట్టేశారో.. అక్కడే మొక్కలు నాటండి!

  • అటవీ భూముల ఆక్రమణకు యత్నించిన నిందితులకు హైకోర్టు వినూత్న శిక్ష..

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికి అటవీ అధికారులకు దొరికిపోయిన నిందితులకు హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ పచ్చదనం పెంచడానికి.. 200 మొక్కలు నాటాలని ఆదేశించింది. మంచిర్యాల జిల్లా జిల్లెడ మండలం నాగారం గ్రామానికి చెందిన మాడె మల్లేశ్‌, ఇతరులు కుష్నేపల్లి రేంజ్‌ లింగాల సెక్షన్‌ గైరెల్లి ఆర్‌ఎఫ్‌ బ్లాక్‌లో అటవీ భూములు ఆక్రమించేందుకు దాదాపు రెండెకరాల్లో చెట్లు నరికేశారు. దీంతో అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేయడంతోపాటు పిటిషనర్‌ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఈ నేపథ్యంలోనే తన ట్రాక్టర్‌ కోసం మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం.. అడవులను ఆక్రమించాలని ప్రయత్నిస్తున్న నేరగాళ్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల అటవీ భూముల విస్తీర్ణం రోజురోజుకీ తగ్గిపోతోందని.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటినుంచి అటవీ నిర్మూలనకు పాల్పడిన వారే.. అంతేస్థాయిలో అడవి పెరిగేలా మొక్కలు నాటాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అటవీ అధికారులు రెండు ఎకరాలకు సరిపోయేలా 200 మొక్కలు పిటిషనర్‌కు అందజేయాలని.. పిటిషనర్‌ ఆ మొక్కలు నాటాలని ఆదేశించింది. అలాగే తగిన పూచీకత్తు, వాహనం విక్రయించబోననేలా అఫిడవిట్‌ తీసుకుని ట్రాక్టర్‌ వదిలేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Aug 08 , 2024 | 04:08 AM