Welfare Act: కోర్సులకు అనుమతిపై ప్రభుత్వానిదే నిర్ణయం
ABN , Publish Date - Aug 10 , 2024 | 04:54 AM
కొత్త కోర్సుల ప్రారంభం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం, లేదంటే తగ్గించడం, కోర్సుల విలీనం వంటి అంశాల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కొత్త కోర్సుల ప్రారంభం, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం, లేదంటే తగ్గించడం, కోర్సుల విలీనం వంటి అంశాల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వానిదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సులు, సీట్ల పెంపు, తగ్గింపు వంటి అంశాలపై తమ దరఖాస్తులను ఉన్నత విద్యాశాఖ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆరోరాస్ టెక్నలాజికల్ అకాడమీ సహా పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాదాపు 27 పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కాలేజీల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. తమకు జేఎన్‌టీయూ, జాతీయ టెక్నికల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని తెలిపారు.
ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జేఎన్‌టీయూ ఇచ్చినది షరతులతో కూడిన అనుమతి అని, అది కేవలం ప్రభుత్వానికి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే పనికివస్తుందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. స్థానికంగా ఉన్న విద్యా అవసరాలు, విద్యా సంస్థల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించడం, సమానత్వం పాటించడానికి తగిన నిర్ణయాలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా చట్టం సెక్షన్ 20 ప్రకారం నిర్ణయాధికారం ఉందని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేస్తూ పిటిషన్‌లను కొట్టేసింది.