Hyderabad : రాష్ట్రంలో ‘బాల్ ఇండియా’ యూనిట్
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:48 AM
రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్‌ఫ్యూమ్‌ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
బీర్లు, కూల్‌డ్రింక్స్, పర్‌ఫ్యూమ్‌ల సంస్థలకు అల్యూమినియం టిన్నుల సరఫరా
రూ.700 కోట్ల పెట్టుబడి.. ప్రభుత్వానికి ఏటా రూ.280కోట్ల అదనపు ఆదాయం
500 మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్‌బాబు
బీర్లకు టిన్నులను వాడాలంటే.. ఎక్సైజ్ పాలసీ మార్చాలని వ్యాఖ్య
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. బీర్లు, శీతల పానీయాలు, పర్‌ఫ్యూమ్‌ల కంపెనీలకు అల్యూమినియం టిన్నులను సరపరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు ‘బాల్ ఇండియా’ కంపెనీ ముందుకొచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ కంపెనీ రూ.700 కోట్ల మేర పెట్టుబడులతో ఉత్పాదన యూనిట్‌ను ఏర్పాటు చేయనుందన్నారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే 500 మందికి ఉపాధి లభిస్తుందని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ‘బాల్ ఇండియా’ కంపెనీ ప్రతినిధి గణేశన్‌తో సచివాలయంలో భేటీ అయ్యామని పేర్కొన్నారు. తెలంగాణలోనూ టిన్నుల బీర్ వినియోగానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తామన్నారు. 500మిల్లీ లీటర్ల పరిమాణంలోని బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాకింగ్ చేయడం వలన ఎక్సైజ్ డ్యూటీ తగ్గుతుందని, తద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.285కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో రూ.1000 కోట్లతో ఏర్పాటయ్యే కోకాకోలా కోక్ ప్యాకింగ్(బాటిలింగ్) యూనిట్‌కు ‘బాల్ ప్యాకేజింగ్ యూనిట్’ సంస్థ అల్యూమినియం టిన్నులను సరఫరా చేస్తుందని మంత్రి తెలిపారు.
ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి
లద్నాపూర్ ఓపెన్ కాస్ట్‌మైన్ కోసం సింగరేణి సేకరించిన భూమిలో ఇళ్లు నిర్మించుకున్న 280 మందికి పరిహారం చెల్లింపు విషయమై లబ్ధిదారులతో చర్చలు జరపాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. మంథని నియోజకవర్గం లద్నాపూర్‌లో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం 2012లో సేకరించిన భూమికి సంబంధించి నిర్వాసితులుగా చెబుతున్న 280 మందికి ఆర్‌అండ్‌ఆర్ చెల్లింపులో చట్టపరమైన అడ్డంకులున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వారందరితో మాట్లాడి మానవతా దృక్పథంతో పరిహారం అందించి సమస్య పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.