Share News

Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!

ABN , Publish Date - Aug 16 , 2024 | 09:37 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు.

Hyderabad: పంద్రాగస్టుకైనా ఇవ్వలే!

- హెచ్‌ఎండీఏ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అందని వేతనాలు

- ఇబ్బందుల్లో డ్రైవర్లు, సెక్యూరిటీ, హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది

- కమిషనర్‌ కరుణ చూపాలని వేడుకోలు

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు. రెండు నెలలుగా ఆలస్యమవుతున్నాయి. దీంతో డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, హౌస్‌ కీపింగ్‌, వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్‌ఎండీఏ(HMDA)లో పంద్రాగస్టు వేడుకలను ఓవైపు సంబరంగా జరుపుతుంటే, మరోవైపు జేబుల్లో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొందని సిబ్బంది ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు.

ఇదికూడా చదవండి: Hyderabad: నైజీరియన్‌తో సహా ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్‌..


హెచ్‌ఎండీఏలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేసే ఉద్యోగుల వేతనాలు స్కిల్డ్‌ అయితే ఒక్కరికి రూ.17వేలు, అన్‌స్కిల్డ్‌ అయితే రూ.13వేల వరకు ఉన్నాయి. హౌస్‌ కీపింగ్‌లో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరి రూ.10వేల లోపే వేతనం వస్తోంది. హెచ్‌ఎండీఏ, బీపీపీ పరిధిలో పని చేస్తున్న డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, హౌస్‌ కీపింగ్‌, ఇతరత్రా సిబ్బంది దాదాపు 600 నుంచి 700 మంది ఉంటారు. వారికిచ్చే అరకొర జీతాలు కూడా సమయానికి రావడం లేదు.


కమిషనర్‌ వద్ద పడిగాపులు

హెచ్‌ఎండీఏలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు హాజరు ఆధారంగా సెక్రటరీ స్థాయిలోనే క్లియర్‌ అవుతాయి. అకౌంటెంట్‌(Accountant) విభాగం ద్వారా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి వేతనాలు వెళ్తే, అక్కడి నుంచి సిబ్బందికి వేతనాలు అందుతాయి. హెచ్‌ఎండీఏ, బుద్ధ పూర్ణిమా ప్రాజెక్టు ఆథారిటీ (బీపీపీఏ), అర్భన్‌ ఫారెస్టు విభాగంలోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఐదారు తేదీల్లోనే వేతనాలు అందేవి. రెండు నెలలుగా పెండింగ్‌లో పడిపోయాయి.


హెచ్‌ఎండీఏ కమిషనర్‌(HMDA Commissioner) ఉన్న కానీ, ఇన్‌చార్జి కమిషనర్లు ఉన్న సందర్భంలోనూ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు, రెగ్యులర్‌ అధికారులు, ఉద్యోగుల వేతనాల ఫైలు సెక్రటరీ స్థాయిలోనే ముందుకు కదిలేది. కానీ ఇటీవల హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ ఆహ్మద్‌(Sarfaraz Ahmed) వచ్చిన తర్వాత కమిషనర్‌ వద్దకే వెళ్తోంది. సెక్రటరీ నుంచి అకౌంట్‌ విభాగానికి వెళ్లాల్సిన ఫైల్‌ కమిషనర్‌ వద్దకు వెళ్లాలంటూ ఇటీవల అంతర్గత ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.


రోజుల తరబడి కమిషనర్‌ ఛాంబర్‌లోనే ఫైలు పెండింగ్‌లో ఉండడంతో 15వ తేదీ వచ్చినా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు అందడం లేదు. బీపీపీఏలో దాదాపు 300ల మందికి పైగా సెక్యూరిటీ, హౌస్‌ కీపింగ్‌ సిబ్బందికి చెందిన రెండు నెలల వేతనాల దస్త్రం కూడా పెండింగ్‌లోనే ఉంది. పేద కుటుంబాలకు చెందిన ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ కరుణ చూపి వేతనాలు సత్వరమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2024 | 09:37 AM