HYDRA: హైడ్రాకు ప్రత్యేక నిధులు..
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:50 AM
రాజధాని నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా ఏర్పాటు
నిర్మాణం, విధివిధానాలపై అధ్యయనం చేయండి
విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత
మునిసిపల్ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ వెల్లడి
విధివిధానాలపై అధ్యయనం చేయండి
2 వేల చ.కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాలి
విపత్తుల నుంచి ఆస్తుల సంరక్షణ వరకు బాధ్యత
బడ్జెట్ కేటాయింపు అంశాన్నీ పరిశీలించాలి: రేవంత్
హైదరాబాద్, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాజధాని నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఫ్లెక్సీలు, ప్రకటనల హోర్డింగులను ఏర్పాటు చేయకుండా చూడటం, తాగునీరు, విద్యుత్తు సరఫరా వంటి అంశాల్లో హైడ్రా కీలకంగా వ్యవహరించాలన్నారు. ఇందుకు అనుగుణంగా విధులు, అధికారాలను బదలాయించాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో హైడ్రా ఆవశ్యకత, పరిధి, పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలపై లోతైన అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీసు విభాగాలను సమన్వయం చేసుకుని సమర్థవంతమైన వ్యవస్థగా హైడ్రా మారాలని సీఎం ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించారు.
కొత్తగా ఏర్పడే హైడ్రాలో ఏ స్థాయి అధికారులు ఉండాలి, ఎంత మంది సిబ్బంది అవసరం, ఎన్ని విభాగాలకు డిప్యుటేషన్‌పై సిబ్బందిని తీసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా నగరంలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్ణయించాలని ఆదేశించారు.
హైడ్రాకు ప్రత్యేక బడ్జెట్..
హైడ్రాకు ప్రత్యేకంగా బడ్డెట్ కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలన్నారు. హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మునిసిపల్ విభాగాల మధ్య సమన్వయం ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. అనధికారిక హోర్డింగుల తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతలను జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్‌ఎంపీ ఈవీడీఎం కమిషన్ రంగనాథ్, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.