Share News

KIMS Kaddals Hospital: క్యాన్సర్‌ను జయించి.. శిశువుకు జన్మనిచ్చి..

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:10 AM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ సోకడంతో.. గర్భసంచి తొలగింపు కోసం వచ్చిన యువతికి వైద్యులు కొత్త భరోసా ఇచ్చారు! గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్‌కు చికిత్స చేయడమే కాక.. ఆమె మళ్లీ మాతృత్వ మధురిమను పొందేలా చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రి వైద్యుల ఘనత ఇది.

KIMS Kaddals Hospital: క్యాన్సర్‌ను జయించి.. శిశువుకు జన్మనిచ్చి..

  • గర్భసంచి తొలగింపునకు వచ్చిన యువతికి వైద్యుల భరోసా

  • పిండాలను ఫ్రీజ్‌ చేసి.. హిస్టరెక్టమీ చేయకుండానే చికిత్స

  • క్యాన్సర్‌ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి జాగ్రత్తగా తొలగింపు

  • ఫ్రీజ్‌ చేసిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టిన వైద్యులు

  • పూర్తి ఆరోగ్యంతో పుట్టిన పాప.. తల్లి, బిడ్డ క్షేమం

రాయదుర్గం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ సోకడంతో.. గర్భసంచి తొలగింపు కోసం వచ్చిన యువతికి వైద్యులు కొత్త భరోసా ఇచ్చారు! గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్‌కు చికిత్స చేయడమే కాక.. ఆమె మళ్లీ మాతృత్వ మధురిమను పొందేలా చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రి వైద్యుల ఘనత ఇది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక (27)కు తొలుత ఒకసారి గర్భవం వచ్చింది. కానీ, కొన్నాళ్ల తర్వాత గర్భస్థశిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో గర్భస్రావం చేయించారు. కొన్నాళ్ల తర్వాత.. ఆమె అనారోగ్యం బారిన పడడంతో పరీక్షలు చేయించగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చినట్టు తేలింది. దీంతో.. తప్పనిసరిగా ఆమె గర్భసంచి తొలగించాలని (హిస్టరెక్టమీ) అక్కడి వైద్యులు చెప్పారు. అందుకోసం ఆమె కొండాపూర్‌లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రికి వచ్చారు.


కానీ.. ‘క్యాన్సర్‌ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగించాల్సిన పనిలేదు. అలా తొలగిస్తే ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. దాన్ని తొలగించకుండానే క్యాన్సర్‌ చికిత్స చేయొచ్చు. ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చు’ అని ఆ ఆస్పత్రిలోని సీనియర్‌ కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌, రోబోటిక్‌ అండ్‌ ల్యాప్రోస్కోప్‌ సర్జన్‌ డాక్టర్‌ వసుంధర చీపురుపల్లి ఆమెకు ధైర్యం చెప్పారు. వైద్యుల కౌన్సెలింగ్‌తో మౌనిక దంపతులు చికిత్సకు ఒప్పుకొన్నారు. దీంతో వైద్యులు తొలుత ఆమె పిండాలను ఫ్రీజ్‌ చేసి.. క్యాన్సర్‌ చికిత్స ప్రారంభించారు. చికిత్స పూర్తైన తర్వాత.. ఫ్రీజ్‌ చేసిన రెండు పిండాలను ఆమె గర్భసంచిలో ప్రవేశపెట్టారు.


అయితే.. గర్భ సంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని భావించి, ఒక పిండాన్ని తీసేశారు. 32వారాల తర్వాత.. ముందుజాగ్రత్త చర్యగా శిశువు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశారు. 37 వారాల తర్వాత.. అంతా బాగుండటంతో ఆమెకు శస్త్రచికిత్స చేశామని, సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి పాప పుట్టిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్‌ వసుంధర తెలిపారు. ‘‘ఒకదశలో.. మాకు అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం. కానీ, డాక్టర్‌ వసుంధర, కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రి బృందం మాకు ఎంతగానో నచ్చజెప్పారు. ఇప్పుడు మాకో చక్కటి పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం’’ అని మౌనిక భర్త మహేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 29 , 2024 | 07:45 AM