Hyderabad : ఈవోడబ్ల్యూకు జీఎస్టీ స్కాం కేసు
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:17 AM
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.
డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం
సోమేశ్‌కుమార్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది. రేవంత్ సర్కారు ఏర్పడ్డ తర్వాత సీఐడీకి అప్పగించిన మొదటి కేసు కావడంతో అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తుపై దృష్టి సారించారు. ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసు బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది. సీఐడీ చీఫ్ షీకాగోయల్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
అక్కడి నుంచి ఆమె అధికారులకు అవసరమైన మౌఖిక ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే కేసు దర్యాప్తునకు అధికారులు, బృందాలను రంగంలోకి దింపనున్నారు.
వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట హైదరాబాద్ సీసీఎస్ పోలీ్‌సలు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత, ఇతర రాష్ట్రాలతో లింకులు ఉండటంతో సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దింపింది.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాలోని పలు కంపెనీలకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! ఢిల్లీ పర్యటన నుంచి సీఐడీ చీఫ్ వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి, న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు..
వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ ఇతరులకు నోటీ్‌సలు జారీ చేసి, విచారించనున్నారు. వాణిజ్య పన్నుల విభాగం అంతర్గత విచారణ, సీసీఎస్ ప్రాథమిక విచారణలోనే స్కాం జరిగినట్లు తేలిన నేపథ్యంలో సీఐడీ విచారణలో మాజీ సీఎ్‌సకు ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.