EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్..
ABN , Publish Date - Jul 28 , 2024 | 04:26 AM
భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారి పక్కన గ్లిడా కంపెనీ ఏర్పాటు చేసిన 102 ఈవీ చార్జింగ్ పాయింట్ల అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.
ఏ సమయంలోనైనా 102 కార్లకు చార్జింగ్..
ప్రారంభించిన ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
శంషాబాద్ రూరల్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారి పక్కన గ్లిడా కంపెనీ ఏర్పాటు చేసిన 102 ఈవీ చార్జింగ్ పాయింట్ల అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నోవాటెల్ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలోనే రెండో అతిపెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఏ సమయంలోనైనా ఇక్కడ 102 కార్లను చార్జ్ చేసుకోవచ్చన్నారు. చార్జింగ్ హబ్‌ను ఏర్పాటు చేసిన గ్లిడా కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు కూడా పెరుగుతాయన్నారు. ముఖ్యంగా విమానాశ్రయ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ చార్జింగ్ హబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. గ్లిడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవేశ్ కె ఝా మాట్లాడుతూ.. తెలంగాణలో ఇదే అతి పెద్ద ఈవీ చార్జింగ్ హబ్ అని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, 30 నగరాలు, 16 హైవేల పక్కన గ్లిడా 730కు పైగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.