Hyderabad : ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్!
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:55 AM
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా.. నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్నా ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవీ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో గెజిట్ జారీ
పది నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ
కార్మికులు, ఉద్యోగుల్లో పలు సందేహాలు
బకాయిలతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా.. నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్నా ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవీ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండు హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం(మహాలక్ష్మి పథకం) కాగా, అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.
ఇక.. రెండోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కాగా, ఇది మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించినా ఏ ఒక్కటీ అమలు కాలేదు. నిధులు కేటాయించకపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నిర్వహణ లోపాలతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీలో కార్మికుల యూనియన్లను రద్దు చేసి, సంక్షేమ బోర్డుల పేరుతో అఽధికారుల పెత్తనాన్ని పెంచి పోషించారు.
ఉద్యోగులు ఎదురు తిరిగే పరిస్థితులు రావడంతో ఎట్టకేలకు ఎన్నికల ముందు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 6న అసెంబ్లీలో బిల్లును ఆమోదించగా.. సెప్టెంబరు 14న అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాతి రోజే ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆర్టీసీ విలీనంపై విధి విధానాలు ఖరారు చేయడానికి సీఎస్ నేతృత్వంలో ఆర్థిక, కార్మిక, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా.. జీవో విడుదల చేయలేదు.
ఇంతలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా... ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. విలీనానికి సంబంధించిన చట్టపరమైన అంశాలన్ని పూర్తి అయినందున అపాయింటెడ్ తేదీని ప్రకటించాలని ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, విలీన ప్రక్రియపై మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిల భారంతో సతమతం
2013 నాటి పీఆర్‌సీకి సంబంధించి 50శాతం బాండ్స్ బకాయిలు రూ. 280కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా.. అందులో రూ.80కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సుమారు 14వేల మంది డ్రైవర్లకు మాత్రమే బకాయిలు చెల్లించింది. ఈ అంశంపై మిగతా కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. అలాగే, ఎస్‌ఆర్‌బీఎ్‌సకు సంబంధించి రూ. 600 కోట్లు, ఎస్‌బీటీకి సంబంధించి మరో రూ.600 కోట్లు, సీసీఎ్‌సకు రూ. 800కోట్లకు పైగా ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సి ఉన్నట్టు తెలిసింది. ఇవి కాకుండా పీఎ్‌ఫకు సంబంధించి మరో రూ.1300 కోట్లు దాకా బకాయిలు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఆర్టీసీకి వచ్చే ఆదాయం సరిపోక అందినకాడికి అప్పులు చేస్తున్నట్టు తెలిసింది. గతంలో రోజుకు రూ. 14-16 కోట్ల మేర ఆదాయం వచ్చేది. మహాలక్ష్మి పథకంతో అది రూ. 20-22కోట్లు పెరిగినట్లు చూపిస్తున్నా.. ఇందుకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం నుంచి సకాలంలో విడుదల కావడం లేదు. మహాలక్ష్మి పథకం రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం నుంచి సుమారుగా రూ.1700కోట్లు రావాల్సి ఉన్నట్టు తెలిసింది. ఇవి విడుదల చేసిన పక్షంలో బ్యాంకుల సాయం లేకుండా నేరుగా సంస్థ ఉద్యోగులకు జీతభత్యాలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.