Share News

Hyderabad : జనవరి 3న ప్రారంభం కానున్న 'నుమాయిష్'.. బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ప్రత్యేకతలివే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:51 PM

84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)కు ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగనున్న నుమాయిష్‌‌లో ఈసారి మరిన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయి..

Hyderabad : జనవరి 3న ప్రారంభం కానున్న 'నుమాయిష్'.. బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ప్రత్యేకతలివే..
84th Numaish Exhibition Hyderabad

ఏటా కన్నులపండుగగా సాగే 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)కు ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్దదైన ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి 1న నాంపల్లి గ్రౌండ్‌లో వేడుకగా నిర్వహిస్తారు. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా వారం రోజులు సంతాపదినాలుగా ప్రకటించడంతో ఈసారి జనవరి 3కి వాయిదా పడింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగనున్న నుమాయిష్‌ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌లు హాజరుకానున్నట్లు సమాచారం.


హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో ఇష్టమైన ఎగ్జిబిషన్ నుమాయిష్‌కు.. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి లభించింది. ప్రతి సంవత్సరం కనీసం 25 లక్షల మంది సందర్శకులు ఈ ప్రదర్శనకు తరలివస్తుంటారు. షెడ్యూల్ ప్రకారం ఏటా 46 రోజుల పాటు సాగే ఈ ప్రదర్శన ఈసారి 44 రోజులే జరగనుంది. ఇప్పటికే నాంపల్లి గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు నిర్వాహకులు. నుమాయిష్ ద్వారా ఈసారి 10వేల మంది లబ్ది పొందబోతున్నారు.


నాంపల్లి గ్రౌండ్స్‌లోని 26 ఎకరాల్లో ఏర్పాటు అయ్యే నుమాయిష్‌లో.. ఈసారి దాదాపు 2300 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. ఇందులో కళాత్మక వస్తువులు, వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్, పిల్లలకు టాయ్స్, ప్లే థీమ్స్, ఫుడ్ కోర్టులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు ఇంకా రకరకాల వస్తువులు ప్రదర్శిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపారులు ఈ ఎగ్జిబిషన్‌లో స్టాళ్లు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారికి స్టాళ్ల కేటాయింపు పూర్తయినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు వెల్లడించారు.


నుమాయిష్‌లో ఈసారి కొన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. అవేంటంటే, జనవరి 6న మహిళలకు, జనవరి 31న పిల్లలకు స్పెషల్ డేలుగా కేటాయించారు. వాటర్‌‌కలర్ పెయింటింగ్స్, రంగోలి, ఫ్లవర్ అరేంజ్‌మెంట్స్, మెహందీ పోటీలు ఉండనున్నాయి. సందర్శకులు ఎంట్రీ అయిన 45 నిమిషాల వరకూ ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు నిర్వాహకులు. 'ఎగ్జిబిషన్ యాప్' ద్వారా ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఇంకా, సందర్శకుల సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని హెల్త్‌కేర్ ప్రైమరీ సర్వీసెస్‌ ఉండనున్నాయి.


నుమాయిష్ వెళ్లేవారి కోసం TGSRTC ప్రత్యేక బస్సులు నడపనుంది. మెట్రోలో వెళ్లాలనుకునేవారు గాంధీభవన్‌లో దిగి అక్కడి నుంచి 5 నిమిషాల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకోవచ్చు. ఎంట్రీ టికెట్ ధర రూ.50లుగా నిర్ణయించారు. పిల్లలకు ఉచితం. శని, ఆదివారాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకూ తెరిచి ఉంటుంది. మిగిలిన రోజుల్లో రాత్రి 10.30 వరకూ ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Updated Date - Dec 30 , 2024 | 03:52 PM