Share News

TS Politics: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నోరుపారేసుకున్న బాల్క సుమన్

ABN , Publish Date - Feb 11 , 2024 | 04:24 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్(Balka Suman) మరోసారి నోరుపారేసుకున్నారు. ముఖ్యమంత్రికి చెప్పు చూపించడంపై సుమన్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నోటిసులపై సుమన్ స్పందించారు.

TS Politics: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నోరుపారేసుకున్న బాల్క సుమన్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్(Balka Suman) మరోసారి నోరుపారేసుకున్నారు. ముఖ్యమంత్రికి చెప్పు చూపించడంపై సుమన్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నోటీసులపై స్పందించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సుమన్ మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ ఒక క్రిమినల్ అని.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని ఆరోపించారు. నిన్ననే సుప్రీంకోర్టు రేవంత్‌కు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని తెలిపారు. ఆయననే ఒక క్రిమినల్ అయినప్పుడు అతని నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తామని ఎద్దేవా చేశారు.

ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని మండిపడ్డారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలన్నారు. తాను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని.. మరి ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ కూడా అవే వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అలాంటప్పుడు ఆయనపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌, తమ పార్టీ నేతలపై పరుష పదజాలం వాడుతున్న కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు పెట్టాలన్నారు. కానీ ఇప్పటిదాకా తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసు నమోదు చేయడం లేదన్నారు. తమ నేతలపై కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని బాల్క సుమన్ హెచ్చరించారు.

Updated Date - Feb 11 , 2024 | 04:31 PM