Balmoor Venkat: నిజాం కాలేజీ విద్యార్థినుల ఆందోళన.. రంగంలోకి బల్మూరి వెంకట్
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:08 PM
నిజాం కాలేజీలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హాస్టల్ డిగ్రీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గురువారం కూడా వారు తరగతులకు హాజరవ్వకుండా ఆందోళన చేపట్టారు. ఈ నిరసన ఆరో రోజుకి చేరుకుంది.
హైదరాబాద్: నిజాం కాలేజీలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హాస్టల్ డిగ్రీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గురువారం కూడా వారు తరగతులకు హాజరవ్వకుండా ఆందోళన చేపట్టారు. ఈ నిరసన ఆరో రోజుకి చేరుకుంది. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిజాం కాలేజీ వీసీకి ఆదేశాలిచ్చినా విద్యార్థినులతో నామమాత్రంగానే చర్చలు జరిగాయి. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రంగంలోకి దిగి విద్యార్థులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. వారు చేస్తున్న ధర్నా వద్దకి వెంకట్ చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. తొలుత సమస్యలపై కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని UG విద్యార్థులకు ఆయన ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. అయితే, మరో వైపు PG విద్యార్థులు ఆందోళనకు దిగారు. UG వాళ్లకి హాస్టల్ కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని వారు కూడా నిరసనకు దిగారు.
మరో భవనం నిర్మించాలి..
తమకు న్యాయం చేయాలని పీజీ విద్యార్థినులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గర్ల్స్ హాస్టల్ డిగ్రీ వాళ్లకే కేటాయిస్తే, తాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌లో బస్సుల్లో సమయానికి కాలేజీకి చేరుకోలేకపోతున్నామని పీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ఆవరణంలో మరో భవనం నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సీనియర్లు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తానని పీజీ విద్యార్థినులకు బల్మూరి వెంకట్ హామీ ఇచ్చారు.
సబితా ఇంద్రారెడ్డిని కలిసి..
మరోవైపు.. కేసీఆర్ ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ, పీజీ విద్యార్థినుల కోసం వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించింది. అయితే ప్రస్తుతం ఉన్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ వారికి 50 శాతం, యూజీ వారికి 50 శాతం కేటాయించారు. ఇలా చేయడాన్ని నిరసిస్తూ యూజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యపై విద్యార్థినులు మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గత ఆదేశాలకు అనుగుణంగా 100 శాతం యూజీ విద్యార్థినులకే హాస్టల్ భవనాన్ని కేటాయించేలా చూడాలని కోరారు. వారి ధర్నా పట్ల సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కేటాయింపుల మాదిరిగానే 100 శాతం యూజీ విద్యార్థినులకు కేటాయించి వారికి న్యాయం చేయాల్సిందిగా నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా నాయక్‌కు సబితా సూచించారు.
భవిష్యత్తు కార్యాచరణపై..
అయితే, యూజీ విద్యార్థినులు ఆందోళనలో భాగంగా ఇవాళ వంటావార్పు చేపట్టారు. వసతి గృహాన్ని తమకే కేటాయించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తు కార్యాచరణ చేపట్టేందుకు సన్నద్ధమవుతామని వారు హెచ్చరించారు. యూజీ, పీజీ విద్యార్థినులకు సమానంగా హాస్టళ్లు కేటాయిస్తామని అధికారులు వెల్లడించగా, దీనికి యూజీ విద్యార్థినులు అంగీకరించలేదు. యూజీ విద్యార్థినుల కోసం నిర్మించిన హాస్టల్‌లో గదులన్నీ తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం తాము పోరాడుతున్నామని.. ప్రభుత్వం తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP News: విశాఖలో ఎన్నికలకు నో బ్రేక్.. ఈసీ గ్రీన్ సిగ్నల్
RJ Shekhar: జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News