Share News

Congress Ministers : బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది.. భట్టి విక్రమార్క విసుర్లు

ABN , Publish Date - Sep 14 , 2024 | 09:31 PM

ప్రతిపక్ష నేతలు అంటే తమకు గౌరవం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బీజేపీ ఉనికి‌ కోసం రాజకీయ‌ డ్రామాలు ఆడుతుందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

Congress Ministers : బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది..  భట్టి విక్రమార్క విసుర్లు

పెద్దపల్లి: బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శాంతిభద్రతలకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. శాసనసభలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరో అసెంబ్లీ స్పీకర్ వెల్లడించారని అన్నారు. ప్రతిపక్ష నేతలు అంటే తమకు గౌరవం ఉందని తెలిపారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.


బీజేపీ ఉనికి‌ కోసం రాజకీయ‌ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామ ప్రజలకు రూ. 18 కోట్లు అందజేశామని అన్నారు. రుణమాఫీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. 2030 వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.


సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులకు ఆదాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా రూ. 18 వేల కోట్లను 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు.


బీఆర్‌ఎస్ ప్రతిదీ రాజకీయం చేస్తోంది: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి: సోం డిస్టలరీస్ రిజిస్ట్రేషన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రిజిస్ట్రేషన్ చేసిన అంశాన్ని కమిటీకి సంబంధిత శాఖ రిఫర్ చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సోం డిస్టిలరీస్ రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు.. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కమిటీకి ఈ ప్రభుత్వం రిఫర్ చేసిందని తెలిపారు. నిన్నా, మొన్న కొట్లాడింది ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే‌లేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. బ్యాంకుల పొరపాట్ల వల్లే కొందరికి రుణమాఫీ ఆగిందని తెలిపారు. మాది బీఆర్‌ఎస్ సర్కార్ లాగా కాదని.. తాము ఒకేసారి రుణమాఫీ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


సోమ్ డిస్టలరిస్ రిజిస్ట్రేషన్ చేశాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

బేవరేజస్ కార్పొరేషన్ పరిధిలో సోమ్ డిస్టలరీస్ అనుమతి ఇవ్వడం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తన పరిధిలో అది జరగలేదని.. తన పరిధికి రాగానే వెంటనే కమిటీకి రిఫర్ చేశానని వివరించారు. దానికంటే ముందు ఆ అనుమతులను రద్దు చేసినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో 870కు పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయని గుర్తుచేశారు.


తప్పులు జరగకుండానే రద్దు చేశామని.. కమిటీకి రిఫర్ చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు అసెంబ్లీలో మాట్లాడకూడదని మంత్రి జూపల్లి అన్నారు. మహిళా మంత్రిపై అభ్యతరకరంగా కామెంట్స్ చేశారని అన్నారు. సోమ్ డిస్టలరీస్ అంశంపై కౌశిక్ రెడ్డి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కొత్తగా వచ్చిన సభ్యులు సభా సాంప్రదాయాలను నియమ నిబంధనలను తెలుసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

Updated Date - Sep 14 , 2024 | 09:32 PM