Phone Tapping Case: రేవంత్ మౌనానికి కారణమదేనా? లక్ష్మణ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - May 29 , 2024 | 01:02 PM
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయని.. ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్(CM Revanth Reddy) ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్, మే 29: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయని.. ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్(CM Revanth Reddy) ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని రేవంత్ చెప్పారని.. ఇన్ని సంచలన విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project Scam) స్కామ్‌పై దర్యాప్తు, విచారణ అన్నారు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాల లీక్‌పై చర్యలు అన్నారు.. డ్రగ్స్‌పై చర్యలన్నారు.. ఏవీ పట్టించుకోవడం లేదని రేవంత్ సర్కార్ తీరును లక్ష్మణ్ తూర్పారబట్టారు.
పోలీసు అదికారులు కేసీఆర్ ప్రమేయంతోనే జరిగిందని చెప్పారని.. వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మాఫియాను నడిపించారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని లక్ష్మణ్ విమర్శించారు. చివరికి జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అరెస్ట్ అయిన అధికారులు చెబుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఒత్తిళ్లకు లొంగిపోయారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అక్రమ సంపాదన డబ్బులను తరలించేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారంటూ లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావుల పేర్లను పోలీసు అధికారులు తమ వాంగ్మూలంలో చెప్పారని లక్ష్మణ్ ఉటంకించారు. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. దేశ భద్రతకు విఘాతం కలిగించేలా చేశారని ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ హై కమాండ్ ఒత్తిడికి లొంగారా? అందుకే ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోవడం లేదా? అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని.. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు బీజేపీ ఎంపీ. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫేక్ సినిమా డ్రామా అని తాను ముందే చెప్పానన్నారు. లిక్కర్ కేసులో కవితను గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేల కేసు బయటకు తీసుకొచ్చారన.. దారుణమైన స్థితికి కేసీఆర్ దిగజారాడని లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ద్రోహానికి పాల్పడిందని.. నీచమైన స్థాయికి దిగజారిందంటూ మండిపడ్డారు లక్ష్మణ్. రేవంత్‌పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్రదారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్.. దిగజారుడు రాజకీయాలు చేశారని.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించారంటూ ఫైర్ అయ్యారు.
అందే శ్రీ పాటను స్వాగతిస్తున్నాం..
తెలంగాణ రాష్ట్ర పాటగా అందే శ్రీ పాటను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. అందే శ్రీ పాట విషయంలో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఒక గొప్ప పాటను అందే శ్రీ రాశారని కొనియాడారు. కేసీఆర్ అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని.. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ వస్తుందని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు రాబోతున్నాయన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్ కొనసాగాలని ప్రజాస్వామ్య వాదిగా కోరుకుంటున్నానని.. సీఎం రేవంత్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లక్ష్మణ్ అన్నారు.